మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. ఇక మరో మూడురోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానుల కోలాహలం మొదలైయిపోయింది. ఇక థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ షురూ చేశారు. ఫ్లెక్సీలు, కటౌట్లతో థియేటర్లను అలకరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కోదాడలోని ఓ ప్రముఖ థియేటర్ వద్ద చరణ్- తారక్ అభిమానుల మధ్య ఘర్షణ నెలకొంది.
తారక్ ఫ్లెక్సీ కడుతుండగా చరణ్ అభిమానులు అడ్డుకోవడంతోఅక్కడ ఘర్షణ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘర్షణలో ఆగ్రహం వ్యక్తం చేసిన తారక్ అభిమాని ఒకరు ఏకంగా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది, వెంటనే పక్కన ఉన్నవారు అలర్ట్ అయ్యి అతనిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని సమాచారం. ఇక సంచారమే అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. ఇరు వర్గాల ఫ్యాన్స్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.