డాక్టర్ రాజశేఖర్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా ‘శేఖర్’. మలయాళ చిత్రం ‘జోసఫ్’కు రీమేక్ అయిన ఈ మూవీని జీవిత డైరెక్ట్ చేశారు. ఈ నెల 20న ‘శేఖర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘శేషు’ను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు పలువురు దర్శకులు కథలో మార్పులు చేర్పులూ చేయాలని సలహా ఇవ్వడంతో అది ఇష్టంలేక తానే తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నానని జీవిత తెలిపారు. ఆ తర్వాత సొంత చిత్రాలు కొన్ని డైరెక్ట్ చేసిన తాను, ఇప్పుడు మరోసారి ‘శేఖర్’ మూవీని రూపొందించానని చెప్పారు. ఇందులో తండ్రీ కూతురు మధ్య కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయని, కూతురు పాత్ర నిడివి తక్కువ ఉండటంతో కొత్త అమ్మాయిని రాజశేఖర్ కూతురుగా చూపించే బదులు శివానితోనే నటింపచేశామని అన్నారు. ఈ చిత్రాన్ని ముందు వేరే దర్శకులతో చేయాలని భావించినా చివరి నిమిషంలో తానే డైరెక్షన్ చేయక తప్పలేదని తెలిపారు.
రాజశేఖర్ తో పాటు ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, ‘జార్జిరెడ్డి’ ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర, శివానీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు. దీన్ని దేశవ్యాప్తంగా ముత్యాల రాందాస్ రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ హక్కుల్ని సృజన ఎరబోలు సొంతం చేసుకున్నారు. ఈ మూవీ కథ గురించి జీవిత తెలియచేస్తూ, ”ప్రతి వ్యక్తి లైఫ్ లో మనకు చాలా ఇష్టపడే వ్యక్తి ఒకరు ఉంటారు. వారు తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్నా ఇలా ఎవరైనా కావ్వచ్చు. అటువంటి వారెవరూ లేకుండా సింగిల్ గా మిగిలిపోతే అతని మైండ్, ఎమోషన్ ఎలా ఉంటుంది? తన పక్కన ఎవరూ లేకున్నా తనకు ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు?” అనేదే సినిమా. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది, ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ ‘శేఖర్’ ఉంటాడు” అని చెప్పారు. నటుడు ప్రకాశ్ రాజ్ మంచి మనసున్న మనిషి అని, ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా ఆయన ఈ చిత్రంలో నటించారని జీవిత అన్నారు. ‘చిరంజీవితో తమకు ఎప్పుడూ ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ… యూట్యూబ్ వారే థంబ్ నెయిల్స్ పెట్టి తమ మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారని వాపోయారు.
రాజశేఖర్ కు నెగెటివ్ పాత్రలు చేయడం కొత్త కాదని, ఆయన కెరీర్ విలన్ పాత్రలతోనే మొదలైందని, ఇప్పటికీ ప్రాధాన్యమున్న ప్రతినాయకుడి పాత్ర వస్తే చిరంజీవి సినిమాలో నటించడానికైనా సిద్ధమేనని జీవిత చెప్పారు. తాను కూడా క్యారెక్టర్ నచ్చితే సినిమాల్లో నటించడానికి రెడీ అని అన్నారు. ‘శేఖర్’ చిత్రాన్ని అత్యధిక రేట్లకు కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రదర్శిస్తామని, అందుకు పంపిణీదారులూ అంగీకరించారని జీవిత తెలిపారు.