అలనాటి అందాల తార జయప్రద గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలబోసిన రూపం ఆమె సొంతం. సూపర్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నారు. సమయం చిక్కినప్పుడల్లా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయప్రద తన గత జీవితం గురించి. కెరీర్ మొదట్లో తనకు ఉన్న భయాల గురించి చెప్పుకొచ్చారు. సాధారణంగా చిత్ర పరిశ్రమలో నటించేవారు ఎవరైనా తమ ముఖం వెండితెరపై ఎలా ఉంటుందో చూసుకోవాలని తహతహలాడుతుంటారు.. కానీ జయప్రద మాత్రం ఇప్పటివరకు తన సినిమాలను తాను చూసుకోలేదట. అందుకు కారణం కూడా ఉందని చెప్పుకొచ్చారు.
“నేనెప్పుడూ నా సినిమాలను చూడలేదు. నా మేకప్, నా హెయిర్ స్టైల్ బావుందో, లేదో.. అని భయపడుతూ ఉండేదాన్ని.. అప్పట్లో దాన్ని భయం అంటారో, పిచ్చి అంటారో తెలియదు కానీ.. ఇప్పటి హీరోయిన్ల లాగా మానిటర్ లో కానీ, వెండితెరపై కానీ నా సినిమాలు నేను చూడలేదు.. ఇక కెరీర్ మొదట్లో నాకు చాలా భయాలు ఉన్నాయి. నేను దాసరి నారాయణరావు దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. దేవుడు దిగివస్తే అనే సినిమాకు అనుకుంటా.. ఒక సీన్ కోసం ఆయన నన్ను బికినీ వేసుకోమన్నారు. అంతే బికినీ నేను వేసుకోను అని ఏడవడం మొదలుపెట్టాను. దీంతో ఆయన నా దగ్గరకు వచ్చి.. ఎందుకు ఏడుస్తున్నావ్.. వెళ్లి బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లోని టైర్ లో కూర్చో.. మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పారు. నేను అలాగే చేశాను. ఎలాంటి ఎబెట్టు లేకుండా ఆ సీన్స్ ముగించేశారు. ఆ తరువాత నేను బికినీ ఎప్పుడూ వేసుకోలేదు. అప్పుడే నిర్ణయించుకున్నా బికినీ వేసుకోకూడదని.. ఇప్పటికి అదే ఫాలో అవుతున్నాను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జయప్రద వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.