జాలాది ఇంటి పేరులోనే ‘జాలం’ ఉంది. ఆయన సాహిత్యం సైతం జాలం చేసి అందరినీ ఆకట్టుకుంది. రాశి కన్నా వాసి మిన్న అన్న తీరున జాలాది పాటలు మురిపించాయి. వందలాది చిత్రాల్లో ఆయన పాట తన ఉనికిని చాటుకుంది. జానపదం పలికించగలరు, సాహిత్యం కురిపించగలరు, చైతన్య గీతాలనూ జ్వలింప చేయగలరు. ఏది చేసినా అందులో జాలాది బాణీ ప్రస్ఫుటంగా కనిపించేది.
కృష్ణాజిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఓ పేద కుటుంబంలో 1932 ఆగస్టు 9న జన్మించారు జాలాది రాజారావు. బాల్యం నుంచీ వివక్షకు గురయ్యారు. దాంతో ఆయన కవితల్లో సదా పేదవాడి ఆకలిమంట ప్రధానాంశంగా ఉండేది. ఇక ఆయన రాసిన నాటకాల్లోనూ జాలాది అదే తీరున సాగారు. కొంతకాలం ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేశారు. ఆ సమయంలో పలు ప్రాంతాలు తిరగడం వల్ల ఆ యా ప్రదేశాల్లోని యాసను పట్టేసి, తన పాటల్లోకి నెట్టేసి రంజింప చేశారు. దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాతలు బలరామరెడ్డి, పరంధామ రెడ్డి ప్రోత్సాహంతో మరో రచయిత మోదుకూరి జాన్సన్ సహకారంతో ‘పల్లెసీమ’ సినిమాకు పాట రాసే అవకాశం సంపాదించారు జాలాది. అలా ‘పల్లెసీమ’ లో “సూరట్టుకు జారుతాది చిటుక్కు చిటుక్కు…” అనే పాటతో జాలాది చిత్రప్రయాణం మొదలయింది. తొలి పాటలోనే అలతి అలతి పదాలతో జాలాది కలం చేసిన అల్లరి జనం మదిని గిల్లింది. విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన ‘దేవుడే గెలిచాడు’లోని “ఈ కాలం పది కాలాలు నిలవాలనీ…” అనే పాట, క్రాంతికుమార్ నిర్మించిన ‘ప్రాణం ఖరీదు’లో “యాతమేసి తోడినా ఏరు ఎండదు…” పాట జాలాది ప్రతిభను మరింతగావెలిగించాయి. పలువురు దర్శకులు ఆయన బాణీని మెచ్చి అవకాశాలు కల్పించారు. ఇక మోహన్ బాబు తాను నిర్మించిన అనేక చిత్రాలలో జాలాది పాటకు ప్రత్యేకంగా పట్టాభిషేకం చేశారు. యన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించిన ‘మేజర్ చంద్రకాంత్’లో జాలాది కలం పలికించిన “పుణ్యభూమి నాదేశం… నమోనమామీ…” పాట ఇప్పటికీ తెలుగునేలపై మారుమోగుతూనే ఉంది. మరో విశేషమేమంటే, యన్టీఆర్ ‘మేజర్ చంద్రకాంత్’లో మరపురాని పాట రాసిన జాలాది, తరువాత ఆయన నటవారసుడు బాలకృష్ణ నటించిన ‘సుల్తాన్’లోనూ “ఆకాశం గుండెల్లో…” అంటూ సాగే పాటలోనూ దేశభక్తిని నింపారు. ఇక నందమూరి మూడోతరం హీరో జూనియర్ యన్టీఆర్ ‘సుబ్బు’లోనూ “ఐ లవ్ మై ఇండియా…” అంటూ దేశభక్తినే ఒలికించారు. ఇలా నందమూరి నటవంశంలో మూడు తరాల హీరోలకు దేశభక్తి గీతాలు రాసే అవకాశం జాలాదికి లభించడం విశేషం.
జాలాది పాటకు అనేక అవార్డులూ రివార్డులూ లభించి, తమ ఉనికిని మరింతగా చాటుకున్నాయి. చివరిదాకా జనాన్ని మెప్పించేలా పాటలు రాస్తూనే జాలాది పయనించారు. ప్రతి జాతీయ పర్వదినాన జాలాది కలం పలికించిన దేశభక్తి గీతాలు వినిపిస్తూ తెలుగువారి మదిలో దేశభక్తిని రగులుకొల్పుతూనే ఉంటాయి