బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మర్నాడే గీతూ రాయల్, ఇనయా రెహ్మాన్ మధ్య జరిగిన వాగ్వివాదంలో సోషల్ మీడియాలో మెజారిటీ నెటిజన్స్ ఇనయా పక్షాన నిలిచారు. గీతూ మరీ ఓవర్ యాక్షన్ చేస్తోందనే అభిప్రాయానికి వచ్చేశారు. బాత్ రూమ్ లో తల వెంట్రుకలు పడిన అంశాన్ని గీతూ అందరి దగ్గర చర్చించడంతో పాటు ఇనయాను కార్నర్ చేయడంతో ఆమె పట్ల వ్యూవర్స్ కు సానుభూతి వచ్చేసింది. అంతేకాదు… రెండేళ్ళ క్రితం కోల్పోయిన తన తండ్రి రెహమాన్ పేరును నిలబెట్టడం కోసం, ఆయన కూతురుగా ఓ ఐడెంటిటీని పొందడం కోసమే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానంటూ ఇనయా కన్నీటి పర్యంతం కావడంతో తోటి కంటెస్టెంట్స్ సైతం ఆమె పట్ల సానుభూతిని చూపించారు.
ఇదే సమయంలో వెంటనే తనకు ఛాన్స్ వచ్చినా గీతూ… తన మనసులో అభిప్రాయం చెప్పకుండా రేవంత్ ను మాట్లాడమని పోరు పెట్టడం కూడా కొందరికి నచ్చలేదు. దాని తోడు రేవంత్ మాట్లాడుతున్నప్పుడు గార్డెన్ నుండి హౌస్ లోకి వెళ్ళి అక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటూ, దానిని వ్యూవర్స్ కు చూపించొద్దని గీతూ బిగ్ బాస్ ను కోరడం కాస్తంత డ్రామాలానే అనిపించింది. ఇదే సమయంలో గీతూ తన తెలివితేటలనూ బాగానే చూపించింది. జీరో నుండి తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సోషల్ మీడియా ఫాలోవర్స్ కు బిగ్ బాస్ షో వేదికగా థ్యాంక్స్ చెప్పడం తెలివైన చర్య. సో… ఆమె ఫాలోయర్స్ గీతూ గెలుపు కోసం కృషి చేయడానికి ఈ నాలుగు మాటలూ బాగానే ఉపయోగపడతాయి. ఈ మొత్తం వ్యవహారం చూసిన వాళ్ళు తొలివారం నామినేషన్స్ లో గీతూ ఉండటం ఖాయమని అంటున్నారు. ఒకవేళ అలా జరిగినా… బిగ్ బాస్ గీతూ లాంటి టాకిటివ్ పర్సన్ ను అంత తేలిగ్గా వదులుకోడు అనిపిస్తోంది. పైగా చిత్తూరు యాసను తనదైన స్టైల్ లో మాట్లాడుతూ, వ్యూవర్స్ లో గీతూ సమ్ థింగ్ స్పెషల్ అనే అనిపించుకుంటున్న ఈ సమయంలో బిగ్ బాస్ అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. నిజంగా గీతూ ఓవర్ యాక్షన్ వికటిస్తే మాత్రం మరో రెండు మూడు వారాల తర్వాత మాత్రమే ఆమె ఎలిమేట్ అవుతుంది!