కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా జూన్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక ఇర్రా మోర్ మాట్లాడుతూ ‘మాది ఆగ్రా. నటనపై ఆసక్తితో 2017లో ముంబై చేరినాటకాలు, స్టేజి ప్లేస్ చేశా. ఆ తర్వాత సినిమాలకోసం ఆడిషన్స్ ఇచ్చా. అలా వర్మ శిష్యుడు సిద్ధార్థ్ దర్శకత్వంలో ‘భైరవగీత’తో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది.ఆ తర్వాత రెండు వెబ్ సిరీస్ చేశా. లాక్‌డౌన్‌లో వర్మ ‘కొండా’ సినిమా స్క్రిప్ట్ పంపారు. సురేఖమ్మ పాత్ర బాగా నచ్చింది. కాలేజీ జీవితం నుంచి రాజకీయ ప్రయాణం వరకూ ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. నటిగా పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న రోల్. స్క్రిప్ట్ చదివాక యూట్యూబ్‌లో సురేఖ వీడియోస్ చూశా. ఆ తర్వాత లుక్ టెస్ట్ చేశా. ఆ తర్వాత ఆమెతో మాట్లాడాను. ఆవిడను కాపీ చేయకుండా నా శైలిలో నటిస్తూ ఆవిడ వ్యక్తిత్వం పాత్రలో కనిపించేలా చూసుకున్నా’ అని చెబుతోంది.
ఇంకా మాట్లాడుతూ ‘సురేఖ గారి అమ్మాయి సుష్మిత ఈ నిర్మాత. నెల షూటింగ్ తర్వాత రషెస్ చూసి ఫోన్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్‌లో కొండా మురళిని షూట్ చేసే సన్నివేశం వస్తుంది. నిజంగా అది జరిగినప్పుడు సుష్మిత ఆయనతో ఉన్నారు. ఆ సీన్ చూశాక మెచ్చుకున్నారు. సురేఖ పాత్రకు న్యాయం చేశానని చెప్పారు. షి ఈజ్ వెరీ హ్యాపీ. అంతే కాదు సురేఖగారి ఫ్యామిలీతో కలిసిపోయాం’ అని అంటోంది ఇర్రా మోర్.