నవంబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సూర్య ‘జై భీమ్’ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్ళంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన మంచి చిత్రాన్ని సూర్య ఓటీటీలో విడుదల చేసి తప్పు చేశారని కొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు. సూర్య అభిమానులు మాత్రమే కాకుండా, మంచి సినిమాను ప్రేమించే అందరూ ‘జై భీమ్’ చిత్రాన్ని సొంతం చేసుకుని విశేష ప్రచారం చేస్తున్నారు.
నిజానికి ఇదే తరహా కథాంశంతో గతంలో తెలుగులో 1995 లో ‘అంకురం’ చిత్రం వచ్చింది. రెండు చిత్రాల కథ పూర్తిగా ఒక్కటే అని చెప్పలేం కానీ చాలా విషయాలలో సామీప్యత కనిపిస్తుంది. గిరిజనులకు జరిగే అన్యాయాన్ని, ముఖ్యంగా పోలీసులు వారి పట్ల ఎంత అమానవీయంగా ఉంటారనే విషయాన్ని ఈ రెండు చిత్రాల్లోనూ ప్రధానంగా చూపించారు. మానవ హక్కులను కాపాడే లాయర్ చంద్రూగా ‘జై భీమ్’లో సూర్య నటిస్తే, ‘అంకురం’లో అదే తరహా పాత్రను శరత్ బాబు పోషించాడు. ఓ గిరిజనుడిని పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు, గర్భవతి అయిన అతని భార్యను అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టడాన్ని ఆపైన ఆమె మరణానికి కారణమవడాన్ని ‘అంకురం’లో చూపించారు. ‘జై భీమ్’లోనూ దొంగతనం కేసు మోపబడిన రాజన్నను పట్టుకోలేక గర్భవతి అయిన అతని భార్య చిన్నతల్లిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి దారుణంగా హింసిస్తారు. ‘అంకురం’లో పోలీసుల చేతిలో చిక్కి ఏమై పోయాడో తెలియని సత్యం ఆచూకి కోసం కథానాయిక ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో లాయర్ తో కలిసి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతుంది. ‘జై భీమ్’లోనూ పోలీసులు అరెస్ట్ చేసిన రాజన్న ఆచూకీ కోసం విద్యా వాలంటరీ అయిన మైత్రీ, మానవ హక్కుల లాయర్ చంద్రూ తో కలిసి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఓ పోలీస్ స్టేషన్ గోడ మీద ఉన్న రాతలతో సత్యం అరెస్ట్ అయిన విషయం ‘అంకురం’లో కథానాయికకు తెలిస్తే, ఓ పోలీస్ స్టేషన్ లో రోడ్డు ప్రమాదం జరిగిన రికార్డుల కారణంగా ‘జై భీమ్’లో రాజన్నను పోలీసులు లాకప్ డెత్ చేశారనేది బయటపడుతుంది. రెండు సినిమాలలోనూ కనిపించని వక్తులు కోసం కోర్టులు కమీషన్స్ ను వేస్తాయి. హెబియస్ కార్పస్ పిటీషన్ ఆధారంగానే రెండు చోట్ల మిస్సింగ్ పర్శన్ ను వెదకడం చేస్తారు.
‘అంకురం’ చిత్రంలో చారుహాసన్ పోషించిన పాత్రకు డాక్టర్ రామనాథం స్ఫూర్తి కాగా, ‘జై భీమ్’లో సూర్య పోషించిన పాత్రకు మానవ హక్కుల లాయర్ చంద్రూ స్ఫూర్తి. అయితే… ‘జై భీమ్’ సినిమాను సహజత్వానికి దగ్గరగా దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించగా, తెలుగులో సి. ఉమామహేశ్వరరావు ఓ నవ వధువు జీవితంలో తారసపడిన ఊహకందని సంఘటనల సమాహారంగా ‘అంకురం’ చిత్రాన్ని తీశారు. అప్పట్లో ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. సి. ఉమామహేశ్వరరావు కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు లభించింది. రేవతి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును పొందారు. అలానే ఇండియన్ పనోరమాకు ఈ సినిమా ఎంపికై మెయిన్ స్ట్రీమ్ కేటగిరిలో ప్రదర్శితమైంది.
‘అంకురం’లోని అంశాలు ‘జై భీమ్’లోనూ ఉండటాన్ని దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన ఆనాటి రోజుల్ని తలుచుకున్నారు. ‘అంకురం’ సినిమా తెరకెక్కించడానికి దాదాపు పది సంవత్సరాలు శ్రమపడ్డానని, రకరకాల కారణాలతో పలువురు ఈ సినిమాను నిర్మించడానికి వెనకడుగు వేశారని అన్నారు. అయితే సురేశ్ కుమార్ ‘అంకురం’ను నిర్మించడానికి ముందుకు వచ్చిన తర్వాత కూడా రెండేళ్ల పాటు ఈ చిత్ర నిర్మాణం సాగిందని అన్నారు. సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం తాను చూశానని, తనకెంతో నచ్చిందని చెప్పారు. ‘జై భీమ్’ చిత్ర కథాంశం 1995 కాలం నాటిదే అయినా ఇప్పటికీ అవే పరిస్థితులు సమాజంలో ఉన్నాయని, చట్టం దృష్టిలో అందరూ సమానమే అనే అందరూ చెబుతుంటారని, కానీ కొందరు దృష్టిలో అది ఎక్కువ సమానమని, అట్టడుగు వర్గాల వారికి తక్కువ సమానమని సి. ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ‘జై భీమ్’లోనూ ఇదే అంశాన్ని దర్శకుడు చూపించడం తనకు నచ్చిందని చెబుతూ, ఆ చిత్ర బృందాన్ని అభినందించారు.