పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి కోర్టు ఐదు రోజుల కస్టడీని విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు రోజుల విచారణ ముగియగా కీలక విషయాలు పోలీసులు రాబట్టారు. నేడు మూడో విచారణ కూడా ముగిసింది. అయితే మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని స్వయంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ విచారిస్తున్నారు. సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో రవిని సజ్జనార్ విచారిస్తున్నారు. కీలక సమాచారం రాబట్టేందుకు స్వయంగా సీపీనే రంగంలోకి దిగారు. మూడో విచారణ అనంతరం రవిని సజ్జనార్ వద్దకు పోలీసులు తీసుకెళ్లారు.
అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ… ‘ఐబొమ్మ రవి పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో సర్వర్ ఐపీలను గుర్తిస్తాం. నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌లో సర్వర్ ఐపీలు ఉన్నాయి. సర్వర్ ఐపీలను ఎక్ట్రాక్ట్ చేస్తాం. ఐబొమ్మ రవి లావిష్ లైఫ్‌కు అలవాటు పడ్డాడు. ప్రతి 20 రోజులకు ఫారిన్ ట్రిప్స్ వెళ్తాడు. వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేసేవాడు. రవి బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నాం. ఐబొమ్మ రవి స్నేహితుడు నిఖిల్ పోస్టర్స్ డిజైన్ చేసి ఇచ్చాడు. స్నేహితుడు నిఖిల్, వాళ్ల చెల్లికి రవి పలుసార్లు ట్రాన్సాక్షన్స్ చేసినట్టు గుర్తించాం’ అని చెప్పారు.
Also Read: IND vs SA: ముగిసిన తొలిరోజు ఆట.. భారత్‌పై దక్షిణాఫ్రికా ఆధిపత్యం!
మూడోరోజు విచారణకు ఐబొమ్మ రవి ఏమాత్రం సహకరించలేదు. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ అడిగితే.. గుర్తు లేదు, మరిచిపోయా అని సమాధానం ఇచ్చాడు. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ లను పోలీసులు ఓపెన్ చేస్తున్నారు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంక్ ఖాతాల వివరాలపైనా రవి నోరు విప్పలేదు. రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు పోలీసులు మెయిల్ చేశారు. విదేశీ పర్యటనలు అంటే ఇష్టం ఉండటం వల్లే వెళ్ళాను అని రవి చెబుతున్నాడు. రవి విజిట్ చేసిన దేశాల్లో ఉన్న పైరసీ లింకుల కూపీని పోలీసులు లాగుతున్నారు.