మరో రెండు నెలల్లో విడుదల కానున్న పెద్ద సినిమాలకు గట్టి దెబ్బ తగలనుంది. అందులోనూ ఫస్ట్ ఎఫెక్ట్ పడేది బాలయ్య పైనే. అసలు విషయం ఏమిటంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం వైఖరితో తెలుగు చిత్ర పరిశ్రమ రాబోయే రెండు నెలల్లో తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. టిక్కెట్ ధరల పెంపు విషయంలో గత కొన్ని నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో తగ్గించిన టిక్కెట్ ధరలను ఇంకా అలాగే కొనసాగిస్తోంది. గత కొన్ని నెలలుగా సినీ ప్రముఖులతో భేటీలు జరుగుతున్నా ఈ విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పట్లో తీసుకునేలా కన్పించడం లేదు. మరోవైపు టాలీవుడ్ లోని టాప్ సినిమాలు నెక్స్ట్ రెండు నెలల్లో విడుదలకు సిద్ధమయ్యాయి.
60 కోట్ల భారీ నష్టం !
తాజా సమాచారం మేరకు బయ్యర్లు ఆంధ్ర, సీడెడ్ ఏరియాలలో మార్కెట్ చేయడానికి అంగీకరించిన చిత్రాలకు నిర్మాతలకు చెల్లించే ధరలపై కోత విధించాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ రెండు ఏరియాల్లో టిక్కెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయనే సాకుతో ప్రొడక్షన్‌కు ముందు చెల్లించడానికి అంగీకరించిన మొత్తంలో కనీసం 20 శాతం తగ్గించుకోబోతున్నారట బయ్యర్లు. అంటే మరో రెండు నెలల్లో నిర్మాతలు కనీసం రూ.60 కోట్లు నష్టపోయే అవకాశం ఉంది.
Read also : “పుష్ప” వీడియో లీక్… బన్నీ మాస్ ఫీస్ట్ కి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం
బాలయ్యపై ఫస్ట్ ఎఫెక్ట్
జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ టిక్కెట్ ధరల విధానం వల్ల ఎఫెక్ట్ పడబోయే మొదటి చిత్రం నందమూరి బాలకృష్ణ “అఖండ”. డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానున్న ఈ సినిమాను ఆంధ్రాలో 35 కోట్లకు, సీడెడ్ ఏరియాల్లో 12 కోట్లకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఆంద్రప్రదేశ్‌లోని సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరలను జగన్ ప్రభుత్వం తగ్గించిన కారణంగా నిర్మాతలకు చెల్లించే మొత్తంలో 30 శాతం తగ్గించాలని బయ్యర్లు డిమాండ్ చేశారని తెలుస్తోంది. కానీ చర్చల అనంతరం అందులో చివరకు 20 శాతం తగ్గించాలని నిర్ణయించారు. నిర్మాతలు కనుక బయ్యర్ల డిమాండ్ కు ఒప్పుకోకపోతే సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రారు. కాబట్టి కేవలం ‘అఖండ’ చిత్ర మేకర్స్ మాత్రమే దాదాపు 9 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది.
‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’కూ తిప్పలు తప్పవు
అదేవిధంగా అల్లు అర్జున్ “పుష్ప” కోసం బయ్యర్లు ఆంధ్రాలో 60 కోట్లకు, సీడెడ్ ఏరియాల్లో 25 కోట్లకు కొనుగోలు చేయడానికి నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు అందులో 20 శాతం కోత అంటే రూ.15 కోట్లకు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు రాజమౌళి మెగా చిత్రం “ఆర్ఆర్ఆర్” నిర్మాతలు దాదాపు 28 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ చిత్రాన్ని ఆంధ్రాలో 100 కోట్లకు, సీడెడ్ ఏరియాల్లో 40 కోట్ల రూపాయలకు మార్కెట్ చేయాలని ప్రతిపాదించారు. ఆచార్య, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ వంటి ఇతర పెద్ద సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బయ్యర్లు డిమాండ్ చేస్తున్న 20 శాతం తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే, నిర్మాతలు దాదాపు 70 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది.
సీఎం కనికరిస్తారా ?
సినీ పరిశ్రమ వినతులు, మంత్రి పేర్ని నాని నేతృత్వంలోని కమిటీ సిఫారసుల విన్నపాలు విని ముఖ్యమంత్రి టిక్కెట్ ధరలు పెంచితే టాలీవుడ్‌కు భారీ ఊరట లభిస్తుంది. మరోవైపు ఆన్లైన్ టికెటింగ్ పై ఏపీ ప్రభుత్వం శరవేగంగా కసరత్తులు చేస్తోంది. మరి టికెట్ రేట్ల పెంపు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.