టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన మొక్కల యజ్ఞం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే సోమవారం నాడు ‘ఎనిమీ’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, నటి మృణాళిని రవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం హీరో విశాల్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్, సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం స్ఫూర్తితో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నాడు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో వారు ప్రారంభించిన ఈ కార్యక్రమం గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుందన్నాడు.
Read Also: హీరో నాగశౌర్య ఫాంహౌస్‌లో పేకాట కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
భవిష్యత్ తరాల మనుగడకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అవకాశం కల్పిస్తుందని హీరో విశాల్ అభిప్రాయపడ్డాడు. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని సూచించాడు. అంతేకాదు తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఈరోజు మొక్కను నాటుతున్నానని.. తన స్నేహితునికి గుర్తుగా ఉండేందుకు ఈ మొక్కకు పునీత్ రాజ్ కుమార్ అని పేరు పెడుతున్నట్లు తెలిపాడు. అటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో నటుడు ఆర్య మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని, భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని కోరాడు.