చిన్నా, పెద్ద వ్యత్యాసం లేకుండా సినిమాలన్నింటికీ టిక్కెట్ రేట్ ఫిక్స్‌డ్ గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయానికి లోలోపల రగిలిపోతున్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకనిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనదారులు ఎవరూ ధిక్కారాన్ని వ్యక్తం చేయలేదు. ఎవరో కొంతమంది పరిశ్రమ సభ్యులు మాత్రమే నోరు విప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నటుడు సిద్ధార్థ్ చేరాడు. సిద్ధార్థ్ ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటాడు. తన మనసులో మాటను చెప్పడానికి వెనుకాడడు.
తాజాగా ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశాడు. ఇడ్లీ, కాఫీ ధరలు నిర్ణయించమని ప్రభుత్వం ఏ రెస్టారెంట్స్ కి చెప్పడం లేదు… మరి సినిమాపై మాత్రమే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు. నేను 25 ఏళ్ల క్రితం తొలిసారి విదేశాల్లో సినిమా చూశాను. నా విద్యార్థి ఐ-కార్డ్ ఉపయోగించి 8 డాలర్లకు చూశాను. అది అప్పట్లో 200 రూపాయలు ప్రస్తుతం మన సినిమాలు సాంకేతికత, ప్రతిభ, ఉపాధి అంశాల్లో అన్ని దేశాలతో పోటీ పడుతున్నాయి. పోలీసు టికెటింగ్, పార్కింగ్, రాయితీ రేట్లపై ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు హక్కు లేదు. మీరు సినిమా కంటే మద్యానికి, పొగాకుకు ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. ఇక ఈ దురాచారాన్ని ఆపండి. మా వ్యాపారం ద్వారా లక్షలాది మంది ప్రజలు చట్టబద్ధంగా జీవనోపాధి పొందుతున్నారు. మేము కష్టపడి పని చేస్తాము. కళను సృష్టించటానికి ప్రయత్నించే మమ్మల్ని చంపడం మానేయండి. సేవ్ సినిమా. మా వ్యాపారం ఎలా చేయాలో మాకు చెప్పకండి. మాకు పన్ను విధించండి. సెన్సార్ చేయండి. అశాస్త్రీయంగా నిర్మాతల జీవనోపాధి పోగొట్టవద్దు. సినిమాలు చూడమని ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు. ప్రతి సినిమా బిలియనీర్‌కి లక్షలాది మంది వేతనదారులు, పెట్టుబడిదారులు ఉన్నారు. మీరు సంపన్నులను ఎంచుకోవాలనుకుంటే, వారు ప్రతి రంగంలో ఉంటారు. మా చిత్రపరిశ్రమను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని ప్రశ్నించాడు.
ఏదైనా సినిమా బడ్జెట్ ను ప్రేక్షకులు నిర్ణయించరు. దాని సృష్టికర్త, పెట్టుబడిదారుడు డిసైడ్ చేస్తాడు. సినిమా ద్వారా ఎంత సంపాదిస్తారో నిర్ణయించే హక్కు ఏ వ్యక్తికీ లేదు. మీరు పేదరికం నుండి వచ్చి కోటీశ్వరులు అయిన రాజకీయ నాయకులను లేదా వ్యాపారవేత్తలను ఇలా ప్రశ్నించగలరా? సినిమా పరిశ్రమను వేధించడం ఆపండి. తిండి విలువ, రోజూ భోజనం పెట్టే రైతు గొప్పతనం మాకు తెలుసు. మేము వారి కోసం ఎల్లవేళలా పోరాడుతూనే ఉంటాము. మేమూ మనుషులమే. పన్ను చెల్లింపుదారులమే అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. మన పరిశ్రమలో స్టార్ డమ్ ఉన్న వ్యక్తులు ఎవరూ ఈ స్థాయిలో కాకున్నా కనీస స్పందనను కూడా వ్యక్తం చేయలేదు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడంలో అశక్తులై ఉన్నారు. ఎవరైనా గొంతు విప్పి ప్రశ్నిస్తే మమ అని పలకటానికి మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటూ నిర్మాతకు అన్యాయం జరుగుతుంటే మాత్రం ప్రేక్షకుల మాదిరి చోద్యం చూస్తున్నారు. అవ్వా కావాలి… బువ్వా కావాలి అన్న ధోరణి విడనాడి ఇకనైనా పోరాడితే పోయేదేం లేదు అని చెప్పుకొచ్చాడు. మరి సిద్దార్థ్ తో పాటు ప్రభుత్వాన్ని ఎదిరించి గళం విప్పే నాయకులు (హీరోలు) ఎవరో చూద్దాం.