హైదరాబాద్ శిల్పకళావేదికలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దాదాపు అందరు హీరోలను కలిశానని.. కానీ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్లు అవుతున్నా పవన్ కళ్యాణ్‌ను నేరుగా ఎప్పుడూ కలవలేదని.. ఇదే తొలిసారి అని నాని తెలిపాడు. మిగతా అందరూ హీరోలు వాళ్లు తనకు ఈ మధ్యే పరిచయం అయిన ఫీలింగ్ ఉంటుందని.. కానీ ఎప్పుడూ కలవని కళ్యాణ్ గారి విషయంలో తనకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్న ఫీలింగ్ ఉందని నాని చెప్పాడు. తన సినిమా ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.
దర్శకుడు వివేక్ ఆత్రేయ, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, హీరోయిన్, నటీనటులు, టెక్నీషియన్‌లు చాలా కష్టపడ్డారని.. కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే వీళ్లందరికీ ఓ తిక్క ఉందని.. కానీ దానికి ఓ లెక్క ఉందని.. ఆ లెక్క ఏంటో సినిమా చూస్తే తెలుస్తుందని నాని అన్నాడు. ప్రతి ఆర్టిస్ట్ నుంచి, ప్రతి టెక్నీషియన్ నుంచి దర్శకుడు బాగా రాబట్టుకున్నాడని నాని పేర్కొన్నాడు. తాము ఈ సినిమా చేస్తూ ఎంత ఎంజాయ్ చేశామో.. ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారన్నాడు. ఈ వేడుకతో తనకు అప్పుడు బ్లాక్ బస్టర్ వచ్చిన పాజిటివ్ వైబ్స్ కలుగుతున్నాయని నాని తెలిపాడు. నివేదా థామస్‌కు ఈ సినిమా మరింత స్పెషల్‌గా నిలుస్తుందన్నాడు. శ్యామ్ సింగరాయ్ సినిమా సమయంలో ఈ క్రిస్మస్ మనదే అన్న డైలాగ్ చెప్పానని.. కానీ ఈ సినిమాకు ఏ డైలాగ్ చెప్దాం అని ఆలోచిస్తుండగా నజ్రియా వాళ్ల తమ్ముడు ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశానని చెప్పాడని.. అప్పుడు నాకు ఓ క్యాప్షన్ గుర్తొంచిందని నాని చెప్పాడు. ఈ సినిమా ఇట్స్ నాట్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఇట్స్ ఎంజాయ్‌మెంట్ అని వివరించాడు.
https://www.youtube.com/watch?v=agGH8P7V7mw