గద్దలకొండ గణేశ్ నుంచి దర్శకుడు హరీశ్ శంకర్ ఖాళీగానే ఉన్నాడు. తదుపరి సినిమాపై చాలాకాలం కసరత్తు చేసిన తర్వాత.. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడు. కానీ, ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతోన్నా, ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. పవన్ తన పొలిటికల్ వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల, ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. దీనికితోడు ఆయన చేతిలో ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఇది మరింత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. అందుకే, పవన్ ఫ్రీ అయ్యేలోపు ఓ సినిమా చేయాలని పూనుకున్నట్టు వార్తలొస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. హరీశ్ శంకర్ తన నెక్ట్స్ సినిమా అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాడట. ఆల్రెడీ అతనితో కలిసి కథా చర్చలు కూడా కొనసాగిస్తున్నాడని తెలిసింది. రీసెంట్ గా అతనితో కలిసి దిగిన ఫోటోని సైతం హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవును, బన్నీ చేతిలో ‘పుష్ప 2’ ఉంది కానీ, ఇది పట్టాలెక్కేందుకు కూడా ఆలస్యం కానుంది. సుకుమార్ ఇంకా కథని డెవలప్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు, అది ఫైనల్ అయ్యేసరికి టైమ్ పడుతుంది. అందుకే, ఈ గ్యాప్ లో బన్నీ కూడా మరో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే హరీశ్ తో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది. మరి, ఈ కాంబో కుదురుతుందా?
ఆల్రెడీ హరీశ్, బన్నీ కలయికలో ‘డీజే’ సినిమా వచ్చిన సంగతి విదితమే. ఈ సినిమాకి ఆశాజనకమైన రివ్యూలు రాకపోయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపించి హిట్ గా నిలిచింది. తనకు ఇదివరకే హిట్ ఇచ్చాడు కాబట్టి, హరీశ్ డైరెక్షన్ లో మరో మూవీ చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇవ్వొచ్చని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ!