మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే! చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతోనే అతడు తన స్టార్డమ్‌ని పక్కనపెట్టి, చిన్న రోల్ అయినా అది పోషించేందుకు ముందుకొచ్చాడు. ఇప్పుడు అదే సాన్నిహిత్యంతో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ఓ అతిథి పాత్రలో నటించేందుకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇటీవల ఓ వెబ్‌సైట్ ఒక న్యూస్ రాసుకొచ్చింది. ఇదో క్రేజీ న్యూస్ కావడంతో, సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయ్యింది.
పవన్ కళ్యాణ్‌తో తాను తీస్తోన్న ‘భవదీయుడు భగత్‌సింగ్’లో దర్శకుడు హరీశ్ శంకర్ ఒక కీలకమైన రోల్ సిద్ధం చేశాడని.. దానికోసం సల్మాన్‌ని రీసెంట్‌గా సంప్రదించగా, అందుకు ఆ హిందీ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని తెలిపింది. అయితే, ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని హరీశ్ శంకర్ తోసిపుచ్చాడు. పవన్ సినిమాలో సల్మాన్ నటించనున్నాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఇలాంటి వార్తలు రాయడానికి ముందు తనని సంప్రదించాలని, తాను వెంటనే స్పందించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హరీశ్ చెప్పుకొచ్చాడు.
కాగా.. భవదీయుడు భగత్‌సింగ్ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతున్నా, పవన్ ఇతర పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. అయితే, ఇప్పుడిది త్వరలోనే పట్టాలెక్కనుందని, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డేని కథానాయిక పాత్ర కోసం ఎంపిక చేయగా, ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తుండడంతో ఆమె తప్పుకుంది. దీంతో మేకర్స్ మరో హీరోయిన్ కోసం జల్లెడ పడుతున్నారు. ఇందులో పవన్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నాడు.