(మార్చి 5న ప్రముఖ నటుడు నాజర్ పుట్టినరోజు)
నటుడు నాజర్ పేరు తెలియనివారు ఉండరు. ఈ తరం వారికి ‘బాహుబలి’లో బిజ్జలదేవునిగా నటించిన ఆయన అభినయం తప్పకుండా గుర్తుండే ఉంటుంది. విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నటిస్తూ సాగుతున్నారు నాజర్. తమిళనాట పుట్టినా, తనదైన అభినయంతో తెలుగువారి మదినీ దోచుకున్నారు నాజర్. నటన, దర్శకత్వం, నిర్మాణం, గానం, గాత్రదానం, రాజకీయం అన్నిటా అడుగు పెట్టి నాజర్ తన బహుముఖ ప్రజ్ఞనూ చాటుకున్నారు.
1958 మార్చి 5న నాజర్ తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. నాజర్ కు చిన్నతనం నుంచీ నటన అంటే అభిమానం. ఆ మక్కువతోనే ‘మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్’లో పి.యు.సి. చదివే రోజుల్లోనే నాటకాలు రాసి, వేసి అందరినీ అలరించేవాడు. తరువాత కొన్నాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన నాజర్ ‘సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ నిర్వహించిన ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లోనూ, ఆ పైన ‘తమిళనాడు ఇన్ స్టిట్యూట్ ఫర్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీ’లోనూ నటనలో శిక్షణ తీసుకున్నారు. ‘సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఛాంబర్’ నిర్వహించిన ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో నటశిక్షణ తీసుకుంటున్న సమయంలోనే చిరంజీవి, సుధాకర్ వంటివారు నాజర్ కు సహద్యాయులు. తరువాత నాజర్ సినిమాల కోసం ప్రయత్నించినా ఆట్టే లాభం లేకపోయింది. ఓ హోటల్ లో పనిచేశారు. అక్కడే ఓ సారి చిరంజీవి, నాజర్ ను చూసి “ఎంతో టాలెంట్ ఉన్నవాడివి… ఈ హోటల్ ఉద్యోగమేంటి… మళ్ళీ ట్రై చెయి… ఈ సారి అవకాశం వచ్చి తీరుతుంది… లేదంటే నేనే ఇప్పిస్తా…” అని భరోసా ఇచ్చారు. దాంతో ఉత్సాహం కలిగిన నాజర్, ఉన్న ఫలంగా ఆ ఉద్యోగం మానేసి, మళ్ళీ సినిమాల వేటలో పడ్డారు. ఆ సమయంలో కె.బాలచందర్, నాజర్ కు తన ‘కళ్యాణ అగతిగల్’లో కన్నయ్ రామ్ అనే పాత్రను ఇచ్చారు. ఈ చిత్రంలో వై.విజయ భర్తగా నాజర్ నటించారు. చిరంజీవి ఇచ్చిన సలహాతోనే నాజర్ ఉత్సాహంగా చిత్రసీమలో అడుగువేశారు. చిత్రమేంటంటే, చిరంజీవితో కలసి నాజర్ నటించింది ఈ మధ్యనే. చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లోనూ, తరువాత వచ్చిన ‘సైరా..నరసింహారెడ్డి’లోనూ ఈ ఇద్దరు మిత్రులు కలసి నటించారు.
నాజర్ ను తెలుగు సినిమా రంగానికి దర్శకుడు గీతాకృష్ణ తన ‘కోకిల’తో పరిచయం చేశారు. అప్పటి నుంచీ టాలీవుడ్ లో తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు నాజర్. తన దరికి చేరిన ఏ పాత్రనైనా అంగీకరించడమే కాదు, దానికి తన అభినయంతో ప్రాణప్రతిష్ఠ చేసేవారు. ‘మాతృదేవోభవ’ చిత్రం నాజర్ ను తెలుగువారికి మరింత దగ్గర చేసింది. ఆ తరువాత నుంచీ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగారు నాజర్. తెలుగులో పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రలు లభించాయి. తెలుగునేలపై ఆయన అభినయానికి పలు అవార్డులూ, రివార్డులూ లభించాయి. తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ నటించి అలరించారు నాజర్.
నటుడిగానే కాదు, గాయకునిగా, డబ్బింగ్ కళాకారునిగా, దర్శకునిగానూ నాజర్ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించుకున్నారు. “వెలై, మదరాసీపట్టిణమ్, 96” చిత్రాల్లో పాటలు పాడి ఆకట్టుకున్నారు. అనేకమంది ప్రముఖ నటులకు తమిళంలో డబ్బింగ్ చెప్పి అలరించారు. “అవతారమ్, దేవతై, మాయన్, పాప్ కార్న్, సున్ సున్ థథా” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయనకు ముగ్గురు తనయులు. వారు కూడా చిత్రసీమలోనే రాణించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దకొడుకు అబ్దుల్ అసన్ ఫైజల్ నటునిగా పరిచయం కావలసింది. అయితే ఆ ప్రయత్నం ఫలించక పోవడంతో అబ్దుల్ తండ్రి నిర్మించే సినిమాలకు, దర్శకత్వం వహించే చిత్రాలకు సహాయకునిగా పనిచేస్తూ ఉంటారు. రెండో తనయుడు లుద్ ఫదీన్ ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందిన ‘శైవం’లో నాజర్ కు మనవడిగా నటించాడు. చిన్న కొడుకు అబి హసన్ , నాజర్ దర్శకత్వంలో రూపొందిన ‘సున్ సున్ థథా’తో నటునిగా పరిచయమయ్యాడు. ఈ ఇద్దరు తనయులు తండ్రి బాటలోనే పయనిస్తూ నటులుగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు.
తన ప్రతి సినిమాను తొలి చిత్రంగానే భావించి, కృషి చేస్తానని అంటారు నాజర్. ఆయన వినయవిధేయతలే నాజర్ కు తెలుగువారి మనసుల్లో చోటు సంపాదించేలా చేశాయని చెప్పవచ్చు. 2015లో నడిగర్ సంఘంకు అధ్యక్షునిగా ఎన్నికై అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పలు తెలుగు చిత్రాలలో నాజర్ నటిస్తున్నారు. నాజర్ మునుముందు మరిన్ని మంచి పాత్రలతో జనాన్ని ఆకట్టుకుంటారని ఆశిద్దాం.