(అక్టోబర్ 15న హీరో సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు)
మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే అదృష్టం అంటారు. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు కొడుకు సాయిధరమ్ తేజ్ ను చూస్తే చిరంజీవి వర్ధమాన నటునిగా ఉన్న సమయంలోని సినిమాలు గుర్తుకు వస్తాయి. అంతేకాదు, నటనలోనూ, డాన్సుల్లోనూ మేనమామను గుర్తుకు తెస్తుంటాడు సాయిధరమ్ తేజ్. ఆయన నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ఇటీవలే జనం ముందు నిలచింది. ఈ చిత్రం విడుదలకు కొద్ది రోజుల ముందే సాయిధరమ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెగా కాంపౌండ్ హీరోల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సాయిధరమ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ 1986 అక్టోబర్ 15న జన్మించారు. చిరంజీవి చెల్లెలు విజయదుర్గ పెద్దకొడుకు సాయిధరమ్ తేజ్. హైదరాబాద్ యూసఫ్ గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో డిగ్రీ చదివాడు సాయిధరమ్. ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోయే. ఈ అన్నదమ్ముల చిత్రాలు వారం గ్యాప్ లో విడుదలై జనాన్ని అలరిస్తున్నాయి. అక్టోబర్ 1న సాయిధరమ్ ‘రిపబ్లిక్’ విడుదల కాగా, అదే నెల 8వ తేదీన వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ జనం ముందు నిలచింది.
సాయిధరమ్ తేజ్ తొలుత వై.వి.ఎస్.చౌదరి రూపొందించిన ‘రేయ్’లో నటించినా, ఆ సినిమా కంటే ముందు ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం విడుదలయింది. ఈ సినిమాతోనే సాయిధరమ్ మంచి మార్కులు సంపాదించేశాడు. ఏడు సంవత్సరాలలో 14 చిత్రాల్లో నటించేశాడు. “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, నక్షత్రం, చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్” చిత్రాలు సాయిధరమ్ తేజ్ కు హీరోగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. సాయిధరమ్ త్వరగా కోలుకొని, మునుపటిలా చురుకుదనంతో తమను అలరించాలని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే సాయిధరమ్ మళ్ళీ ఓ కొత్త చిత్రంలో నటిస్తారని, మరిన్ని సినిమాలతో మురిపిస్తారని ఆశిద్దాం.