(డిసెంబర్ 23న ఆది సాయికుమార్ పుట్టినరోజు)
తాత పి.జె.శర్మ, తండ్రి సాయికుమార్, బాబాయిలు రవిశంకర్, అయ్యప్ప శర్మ బాటలోనే పయనిస్తూ ఆది నటనలో అడుగుపెట్టాడు. ఆరంభంలో ఆదిగానే కనిపించినా, మరో ఆది కూడా ఉండడంతో ‘ఆది సాయికుమార్’గా మారిపోయాడు. తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’తోనే హీరోగా సాలిడ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఆది అప్పటి నుంచీ వైవిధ్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు.
నటుడు సాయికుమార్, సురేఖ దంపతులకు 1989 డిసెంబర్ 23న ఆది జన్మించాడు. ఆది పూర్తి పేరు ఆదిత్య పూడిపెద్ది. చెన్నైలోని పద్మా శేషాద్రి స్కూల్ లో ఏడో తరగతి దాకా చదువుకున్న ఆది, తరువాత హైదరాబాద్ “సెయింట్ ఆండ్రూస్ స్కూల్ లోనూ, సెయింట్ జాన్స్ కాలేజ్ లోనూ” చదివారు. భవన్స్ వివేకానంద కాలేజ్ లో చదువుతూ వదిలేశాడు. ఆది చదువుకొనే రోజుల్లో ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. క్రికెట్ లో అండర్ 19 టీమ్ లో రంజీకి ఆడారు. 2011లో ‘ప్రేమకావాలి’ సినిమాతో జనం ముందుకు హీరోగా వచ్చాడు ఆది. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకావాలి’ మంచి విజయం సాధించింది. తరువాత బి.జయ దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన ‘లవ్లీ’ కూడా మంచి విజయం అందుకుంది. “ప్యార్ మే పడిపోయా” చిత్రంలో “చిన్నపిల్లలు…” సాంగ్ పాడి పాటగాడిగానూ ఆకట్టుకున్నాడు ఆది. “గాలిపటం, చుట్టాలబ్బాయ్, శమంతకమణి, నెక్ట్స్ నువ్వే, బుర్రకథ, జోడీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, శశి” వంటి చిత్రాలలో ఆది నటన ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఆది సాయికుమార్ ‘జంగిల్’ అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. వీటితో పాటు “కిరాతక, అమరన్ ఇన్ ద సిటీ, బ్లాక్” సినిమాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాలతో ఏ తీరున ఆది అలరిస్తారో చూద్దాం.