నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా విడుదలను జూలై 8 నుండి 22కు వాయిదా వేయడంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే పనిలో ‘హ్యాపీ బర్త్ డే’ నిర్మాతలు పడ్డారు. ఇప్పటికే ఒక రేంజ్ లో పబ్లిసిటీని ప్రారంభించిన ‘హ్యాపీ బర్త్ డే’ నిర్మాతలు తమ చిత్రాన్ని ముందు జూలై 15న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఆ వారం ‘ది వారియర్, గుర్తుందా శీతాకాలం, ఆర్జీవీ అమ్మాయి’ వంటి సినిమాలూ విడుదల అవుతున్నాయి. బహుశా జూలై 8కి వస్తే సోలో రిలీజ్ అవుతుందని వీరు భావించి ఉండొచ్చు. తాజాగా తమ చిత్రాన్ని జూలై 15న కాకుండా 8వ తేదీనే రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. ఆ వీకెండ్ లో ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు తప్పితే చెప్పకోదగ్గ పెద్ద చిత్రాలు లేవు.
‘మత్తు వదలారా’తో దర్శకుడిగా తనకంటూ ఓ చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు రితేష్ రానా. అతని దర్శకత్వంలోనే ‘హ్యాపీ బర్త్ డే’మూవీని క్లాప్ ఎంటర్ టైన్ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో నరేశ్ అగస్త్య, సత్య, వెన్నెల కిశోర్, గుండు సుదర్శన్ ఇతర కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. పూర్తి వినోదాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించాడు.