తమిళనాట ‘తల’గా అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్నారు అజిత్ కుమార్. ఈ మధ్య అజిత్ విజృంభణ కాసింత నెమ్మదించింది. అయినా, అభిమానగణాలకు మాత్రం ‘తల’సినిమా వస్తోందంటే చాలు పండగే! అంతలా తమిళ జనాన్ని అలరిస్తున్న అజిత్ కుమార్ తెలుగునాట పుట్టడం విశేషం! ఎందరో తెలుగువారు తమిళ చిత్రసీమలోనూ రాణించారు. అజిత్ స్థాయిలో తమిళచిత్రసీమలోనే స్థిరపడి స్టార్ హీరో అయిన వారు లేరు. అజిత్ సినిమాలు అనేకం తెలుగులోకి అనువాదమై అలరిస్తున్నాయి.
Read Also: Police: సారా కావాలన్న ఖైదీ.. సంస్కారంగా ఇప్పించిన పోలీస్
అజిత్ కుమార్ కన్నుతెరచింది సికిందరాబాద్ లోనే. 1971 మే 1న అజిత్ జన్మించారు. కొంతకాలం వైజాగ్ లోనూ ఉన్నారు. చెన్నైలో చదివారు. అయితే అతని అన్న, తమ్ముడు ఇద్దరూ చదువులో ఎంతగానో రాణిస్తే అజిత్ మాత్రం పెద్దగా చదువుకోలేదు. 1990లో సురేశ్ హీరోగా రూపొందిన ‘ఎన్ వీడు ఎన్ కనవర్’ అనే చిత్రంలో అజిత్ ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తరువాత ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ ‘ప్రేమపుస్తకం’ తెరకెక్కిస్తూ అజిత్ ను హీరోగా ఎంచుకున్నారు. ఆ సినిమాలో అజిత్ పేరును శ్రీకర్ గా మార్చారు. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే ప్రమాదవశాత్తు శ్రీనివాస్ మరణించారు. తరువాత గొల్లపూడి సినిమాను పూర్తి చేశారు. అందువల్ల ఆ సినిమా షూటింగ్ ఆలస్యమయింది. ఈ లోగా తమిళ దర్శకుడు సెల్వ రూపొందించిన ‘అమరావతి’ చిత్రంలో హీరోగా నటించారు అజిత్. ‘ప్రేమపుస్తకం’ విడుదలైనా తెలుగులో అతనికి అవకాశాలేమీ లభించలేదు. దాంతో తమిళనాటనే తన అదృష్టం పరీక్షించుకున్నారు. అగత్యన్ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘కాదల్ కోట్టై’ అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమలేఖ’ పేరుతో అనువాదమై ఇక్కడా మంచి విజయాన్ని చేజిక్కించుకుంది. ఆ తరువాత ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ‘వాలి’ చిత్రంలోనూ అజిత్ అభినయం అందరినీ అలరించింది. ఈ చిత్ర విజయంతో అజిత్ తమిళనాట స్టార్ హీరోగా మారారు.
Read Also: Rain: విషాదం నింపిన వర్షం.. విద్యుత్ వైర్లు తెగిపడి కానిస్టేబుల్ మృతి
తమిళనాట అజిత్ కు ఊహించని విధంగా స్టార్ డమ్ లభించింది. అతను నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. అజిత్ స్టైల్ అంటే ఆయన అభిమానులకు విపరీతమైన క్రేజ్. తల మొత్తం నెరసిపోయినా, రంగు కూడా వేసుకోకుండా, కొన్నిసార్లు గడ్డం కూడా గీసుకోకుండా అజిత్ నటించిన తీరు ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో మురిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాలనటిగా మెప్పించిన శాలినిని అజిత్ పెళ్ళాడారు. వారికి ఇద్దరు పిల్లలు. అజిత్ కు రేస్ కార్లన్నా, బైక్స్ అన్నా ఎంతో ఇష్టం. ఇక తనతో పనిచేసే వారిని, షూటింగ్ లో కో-వర్కర్స్ ను ఆయన ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. తన ఇంట్లో పనిచేసేవారికి ఇళ్ళు కూడా కట్టించి మంచి మనసు చాటుకున్నారు అజత్. ‘నేర్కొండ పార్వై’ వరకు అజిత్ సినిమాలు వసూళ్ళ వర్షం కురిపించాయి. గత యేడాది వచ్చిన ‘వలీమై’, ఈ సంవత్సరం విడుదలైన ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’) అంతగా ఆకట్టుకోలేక పోయాయి. మళ్ళీ అజిత్ మునుపటి స్పీడు చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి వారి అభిలాషను అజిత్ ఏ సినిమాతో తీరుస్తారో చూడాలి.