బాలనటిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన హన్సిక మోత్వాని, 2007లో ‘దేశముదురు’తో కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఒకటిన్నర దశాబ్దకాలంలో వివిధ భాషల్లో యాభైకు పైగా చిత్రాలలో నాయికగా నటించింది. అంతేకాదు… వెబ్ సీరిస్, టీవీ షోస్ లోనూ తన సత్తా చాటింది. మంచి నటిగానే కాదు… మనసున్న మనిషిగానూ పేరు తెచ్చుకున్న హన్సిక కొందరు చిన్నారులను దత్తత్త తీసుకుని వారి ఆలనా పాలన చూసుకుంటోంది.
హిందీ చిత్రసీమలో బాలనటిగా మెరుపులు మెరిపించిన హన్సికకు హీరోయిన్ గా తొలి ఛాన్స్ లభించింది టాలీవుడ్ లోనే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘దేశముదురు’లో కథానాయికగా నటించి, తొలి చిత్రంతోనే యువత మదిని కొల్లగొట్టింది ఈ తేనెకళ్ళ సోయగం. ఆ తర్వాత ఎన్టీయార్ సరసన ‘కంత్రి’, రామ్ కు జోడీగా ‘మస్కా, కందిరీగ’ వంటి సినిమాలలో నటించింది. ఆ పైన తమిళంలో అవకాశాలు రావడంతో అక్కడకు ఫిష్ట్ అయినా… అడపాదడపా తెలుగు సినిమాలలో నటిస్తూనే ఉంది. అయితే ఆ సినిమాలేవీ ఆమెకు పెద్దంత విజయాలను అందించలేదు. కానీ కోలీవుడ్ లో వచ్చినన్ని అవకాశాలు ఆ తర్వాత హన్సికకు తెలుగులో రాలేదనే చెప్పాలి. అయితే… తిరిగి ఇప్పుడిప్పుడే ఇక్కడ సినిమాలలోనూ నటించేందుకు హన్సిక ఆసక్తి చూపుతుంది. ఆమె నటించిన ‘గౌతమ్ నంద’, ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.ఎల్.ఎల్.బి.’ చిత్రాలు ఆ మధ్య జనం ముందకు వచ్చాయి. అలానే శింబు అతిథి పాత్ర పోషించిన హన్సిక 50వ చిత్రం ‘మహ’ డబ్బింగ్ వర్షన్ ఈ మధ్యే ఇక్కడా విడుదలైంది.

ప్రస్తుతం హన్సిక తెలుగులో రెండు సినిమాలలో నటిస్తోంది. ఈ రెండూ కూడా ఆమె కెరీర్ లోనే చెప్పుకోదగ్గ చిత్రాలు కావడం విశేషం. అందులో ఒకటి లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మరో సినిమా ‘105 మినిట్స్’. ఇది సింగిల్ క్యారెక్టర్, సింగిల్ షాట్ మూవీ. బొమ్మక్ శివ నిర్మించిన ఈ సినిమాను రాజు దుస్పా తెరకెక్కించారు. సామ్ సి.ఎస్. మ్యూజిక్ అందించారు. ఇవి కాకుండా తమిళంలోనూ హన్సిక మూడు నాలుగు సినిమాలలో నటిస్తోంది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి పదిహేనేళ్ళు గడిచినా… 32 ఏళ్ళ వయసులో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని హన్సిక మున్ముందుకు సాగుతుండటం విశేషమే. ఆగస్ట్ 9 ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని హన్సిక చిత్రాల నిర్మాతలు బర్త్ డే విషెస్ ను స్పెషల్ పోస్టర్స్ ద్వారా తెలియచేశారు.