Chhello Show: ప్రస్తుతం అందరి చూపు గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ మీదే ఉంది. ప్రపంచాన్నే వసూళ్లతో షేక్ చేసిన ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ ను వెనక్కి నెట్టి ఒక చిన్న సినిమా ఆస్కార్ రేసులోకి దిగింది. అంతగా ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటి..? అసలు ఈ సినిమా కథ ఏంటి..? అనేదాని మీద చర్చ నడుస్తోంది.. దాని గురించి చెప్పాలంటే.. లాస్ట్ ఫిల్మ్ షో(ఛెల్లో షో) ఒక చిన్న సినిమాగా 2021 లో రిలీజ్ అయ్యింది. పాన్ నలిన్ ఈ సినిమాకు దర్శకత్వం, కథ, నిర్మాతగా వ్యవహరించాడు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఎంతో సున్నితమైన కథ అని తెలుస్తోంది. ఒక కుగ్రామం.. అందులో ఒక తొమ్మిదేళ్ల బాలుడు సామే.. అతడి తండ్రికి ఒక టీ కొట్టు ఉంటుంది. పొద్దునే స్కూల్ కు వెళ్లడం.. సాయంత్రం తండ్రికి చేదోడువాదోడు గా టీ అమ్ముతూ ఉంటాడు. ఇక సామేకు సినిమాలు అంటే పిచ్చి. స్కూల్ ఎగ్గొట్టి మరీ సినిమా చూడడానికి వెళ్లి.. తండ్రికి దొరికిపోయి తన్నులు తింటాడు.
ఇక ఇలా జరుగుతున్న సమయంలో సామే తల్లి చేసిన వంట తిని ముగ్దుడైపోతాడు థియేటర్ లో పనిచేసే యువకుడు. దీంతో ఒక ప్లాన్ వేస్తాడు సామే.. తల్లి చేసిన వంటకాలను తీసుకెళ్లి థియేటర్ ఓనర్ కు ఇచ్చి.. ఫ్రీ గా సినిమాలు చూస్తూ ఉంటాడు. అలా సామేకు సినిమాల మీద ఆసక్తి ఎక్కువైపోతోంది. ఇక అన్ని మంచిగా జరుగుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఆ థియేటర్ ను కొన్ని కారణాల వలన మూసేస్తారు. చివరగా లాస్ట్ షోను చూడమని సామేకు చెప్తారు. దీంతో ఆ కుర్రాడు తనకు సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఇంకా సినిమాలు చూడలేనని బాధపడతాడు.. అలా సామేకు ఒక ఆలోచన వస్తోంది.. తన దగ్గర ఉన్న పరికరాలను అన్ని వాడి ఒక ప్రొజెక్టర్ ను తయారు చేస్తాడు. అందులో తనకు నచ్చిన సినిమాలు వేస్తూ స్నేహితులకు చూపిస్తూ ఉంటాడు. అలా ఆ కుర్రాడు సినిమా మీద ఉన్న పిచ్చితో ఎలా మళ్లీ థియేటర్ ను ఓపెన్ చేయించాడు.. అనేదే కథ. ఒక తొమ్మిదేళ్ల కుర్రాడు.. సినిమాను ఎలా చూపించాలి అనేదాని మీద రీసెర్చ్ చేసి, ఒక కొత్త ప్రొజెక్టర్ ను తయారుచేసి.. తన కలను సాకారం చేసుకుంటాడు. ఇక ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది.. “నేను లైట్ ను నేర్చుకోవాలనుకుంటున్నాను.. ఎందుకంటే.. ప్రతి కాంతి ఒక కథను చెప్తోంది.. ప్రతి కథ ఒక సినిమా అవుతోంది.. భవిష్యత్తు అంతా స్టోరీ రైటర్స్ దే” ఈ ఒక్క డైలాగ్ తో సినిమా కథను చెప్పేశాడు పాన్ నలిన్. ఇక సామే గా నటించిన కుర్రాడి పేరు భవీన్ రబారీ.. ఈ సినిమాలో సినిమా పిచ్చి ఉన్న బాలుడిగా అతడు నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పుకోవచ్చు. ఒక సినిమా కోసం ఒక బాలుడు పడిన తపన ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేస్తోంది. అందుకే ఈ సినిమా ఆస్కార్ కు వెళ్లిందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి కథ నెట్టింట వైరల్ గా మారింది.