ఆరంభం నుంచి కెరీర్ పడుతూ లేస్తూ సాగుతున్నా రెజీనా మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల కాలంలో గ్యాప్ వచ్చినా కూడా అదే నమ్మకంతో ముందుకు వెళుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ‘సానా కష్టం’ అంటూ ఐటెం సాంగ్‌తో మెరవనుంది. ఇదిలా ఉంటే రెజీనా నటించిన ‘రాకెట్ బాయ్స్’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించంది. నిఖిల్ అద్వానీ రూపొందించిన ఈ సీరీస్ అణు భౌతిక శాస్త్రవేత్తలు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ హోమీ జె భాభా జీవిత కథగా తెరకెక్కింది. ఇందులో రెజీనా విక్రమ్ భార్య మృణాళిని సారాభాయ్ గా కనిపించింది.
Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ
97 సంవత్సరాలు జీవించిన ఈ లెజెండరీ డాన్సర్ 1965లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ గ్రహీత. మృణాళిని స్థాపించిన ప్రతిష్టాత్మకమైన దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ 1998లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. అలాంటి లెజెండరీ డాన్సర్ మృణాలిని పాత్ర పోషణ కోసం రెజీనా అహ్మదాబాద్‌లోని దర్పణ్ అకాడమీని సందర్శించి వ్యక్తిగతంగా మృణాలిని పాత్ర వ్యవహారశైలిని నేర్చుకోవడం విశేషం. ఈ సినిమాలో ఇష్వాక్, రెజీనాపై రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంది. ఈ సీరీస్ ఇప్పుడు రెజీనాకు గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతే కాదు ‘రాకెట్ బాయ్స్’ చక్కటి ఫలితాన్ని సాధించి ట్రెండింగ్‌లో కూడా ఉంది.
ఇక IMDbలో 9.7 రేటింగ్ సాధించటం ఈ సినిమాకు లభించిన విజయానికి ప్రతీకగా చెబుతున్నారు. ప్రస్తుతం రెజీనా తన తదుపరి చిత్రం ‘షాకిని డాకిని’లో నటిస్తోంది. సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ‘మిడ్‌నైట్ రన్నర్స్’కి అఫీషియల్ రీమేక్ ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ కూడా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు, సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ‘రాకెట్ బాయ్స్’తో వచ్చిన గుర్తింపుతో రెజీనా మునుముందు ఇంకెలాంటి సినిమాల్లో సందడి చేస్తుందో చూద్దాం.