ఈ యేడాది ఏప్రిల్ 9న విడుదలైన మలయాళ చిత్రం ‘నాయత్తు’ తెలుగు రీమేక్ పై చాలామంది కన్నేశారు. అయితే దాని పునర్ నిర్మాణ హక్కుల్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెలుగువారికి నచ్చుతుందనేది అల్లు అరవింద్ నమ్మకం. విశేషం ఏమంటే ఇందులో ఓ కీలక పాత్రకు రావు రమేశ్ ను ఎంపిక చేశారు. మూవీ కథ ఆయన చుట్టూనే తిరుగుతుండటంతో బిజీ ఆర్టిస్ట్ అయిన రావు రమేశ్ బల్క్ డేట్స్ సంపాదించడానికి గీతా ఆర్ట్స్ సంస్థ భారీ మొత్తాన్నే పారితోషికంగా ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ మూవీకి ఆయన ఏకంగా రూ. 1.5 కోట్ల రెమ్యూనరేషన్ పొందుతున్నారని తెలిసింది. ఇందులో మరో రెండు కీలక పాత్రలను శ్రీవిష్ణు, అంజలి పోషించబోతున్నారట. తొలిచిత్రం ‘పలాస’తో మేకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కరుణ కుమార్. ఆయనే ఆ తర్వాత ‘ఆహా’ కోసం ఖదీర్ బాబు రాసిన ‘మెట్రో కథలు’ వెబ్ సీరిస్ చేశారు. కరుణ కుమార్ వర్కింగ్ స్టైల్ నచ్చిన అల్లు అరవింద్ ఇప్పుడు ‘నాయత్తు’ రీమేక్ బాధ్యతలను కూడా ఆయనకే ఇచ్చారట. సుధీర్ బాబు హీరోగా కరుణ కుమార్ తెరకెక్కించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఈ నెల 27న జనం ముందుకు రాబోతోంది.