సినీ కార్మికుల వేతన సవరణను తెలుగు చిత్రసీమ పట్టించుకోకపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. సినిమా కార్మికులతో ఇప్పటికే వేతన సవరణ ఒప్పందం చేసుకోవాల్సిన ఫిల్మ్ ఛాంబర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో తెలుగు నిర్మాత మండలి సైతం ఫెడరేషన్ సూచనలు, సలహాలను పక్కన పెట్టేసిందన్నది కార్మికుల ఆరోపణ.
గతంలో తమతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయనందున ఫెడరేషన్ నేతల మాటను గౌరవించేది లేదని ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్మాతల మండలి తేల్చి చెప్పేసింది. ఇటు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి అటు సినీ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మధ్య కార్మికుల పరిస్థితి అడ్డకత్తెరలో పోక చెక్క మాదిరి అయిపోయింది. దాంతో వేతన సవరణ ఒప్పందం వెంటనే కుదుర్చుకోవాలని ఫెడరేషన్ కార్యవర్గంపై ఒత్తిడి తీసుకురావాలనే నిర్ణయానికి ఇరవై నాలుగు యూనియన్ల కార్మికులు వచ్చారు. ఇందులో భాగంగా రేపు (జూన్ 22) ఉదయం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫీస్ ను ముట్టడి చేయబోతున్నారు. రేపటి నుండి వేతనాలు పెంచే వరకూ 24 క్రాప్ట్స్ కి సంబంధించిన వర్కర్లు షూటింగ్ కు హాజరు కాకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సో…. బుధవారం నుండి సినిమా షూటింగ్స్ కు అనధికారికంగా బంద్ ప్రకటించినట్టే! చూడాలి ఏం జరుగుతుందో!