ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని శనివారం హిందీ, మరాఠీ భాషల్లో ‘బాల శివాజీ’ పేరు భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఆనంద్ పండిట్, రవి జాదవ్, సందీప్ సింగ్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరించబోతున్నారు. ‘బాల్ గాంధర్వ, నటరంగ్’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మరాఠీ చిత్రాలను రూపొందించిన రవి జాదవ్ ‘బాల శివాజీ’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. శివాజీ నిజ జీవిత ఘటనలను వెండితెరపైకి సన్నివేశాలుగా మలచడం కోసం దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
Read Also : Bheemla Nayak Pre Release Event : రంగంలోకి కేటీఆర్
హిందూ పద్ పాద్ షాహీగా పేర్గాంచిన శివాజీ జీవితంలో 12- 16 సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. హిందూ సామ్రాజ్య నిర్మాణం, స్వదేశీ వంటి అంశాల విషయమై శివాజీ మదిలో బీజం పడింది ఆ సమయంలోనే! ‘1630లో జన్మించిన శివాజీ భారత దేశాన్ని పరిపాలించిన మహా రాజులలో ప్రత్యేకమైన వ్యక్తి అని, ఆయన జీవితంలోని అపూర్వ ఘట్టాలను తెలిపే ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంద’ని ‘పీఎం నరేంద్రమోదీ, సర్బజిత్’ చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్న సందీప్ సింగ్ తెలిపారు. ‘అంతర్జాతీయ స్థాయిలో ‘బాల శివాజీ’ చిత్ర నిర్మాణం జరుగుతుందని, ఈ యేడాది జూన్ నుండి షూటింగ్ ను ప్రారంభిస్తామ’ని ఎరోస్ సీఈవో ప్రదీప్ ద్వివేది స్పష్టం చేశారు.