Pandanti Kapuram Fifty Years Special : యాభై ఏళ్ళ ‘పండంటి కాపురం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pandanti Kapuram Fifty Years Special :
తమను తాము స్టార్స్ గా తీర్చిదిద్దుకోవడానికి కొందరు హీరోలు సొంతగా చిత్రాలు నిర్మించి అలరించారు. అలాంటి వారిలో నటశేఖర్ కృష్ణ సైతం చోటు సంపాదించారు. తొలి రోజుల్లో వరుస విజయాలు చూసిన కృష్ణ తరువాత సరైన సక్సెస్ కోసం పరితపించారు. పైగా ఓ వైపు మాస్ హీరోగా యన్టీఆర్, మరోవైపు ప్రేమకథా చిత్రాలతో ఏయన్నార్ విజయవిహారం చేస్తున్న రోజులవి. వారిద్దరి మధ్య తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకొనే ప్రయత్నంలో కృష్ణ సైతం సొంతగా చిత్రనిర్మాణం చేపట్టాలని ఆశించారు. ఆయన అభిలాషకు తమ్ముళ్ళు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు సైతం దన్నుగా నిలిచారు. తత్ఫలితంగా ‘పద్మాలయా’ సంస్థ వెలసింది. తొలి ప్రయత్నంలో ‘అగ్నిపరీక్ష’ అలరించలేకపోయింది. ఆ పై భారీ వ్యయంతో ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిర్మించి, కృష్ణ- ఆయన సోదరులు విజయం సాధించారు. తదుపరి ప్రయత్నంలో నటుడు, కథకుడు డాక్టర్ యమ్.ప్రభాకర్ రెడ్డితో కలసి ‘పండంటి కాపురం’ నిర్మించారు కృష్ణ సోదరులు. కృష్ణ సమర్పకుడిగా ప్రభాకర్ రెడ్డి బ్యానర్ ‘జయప్రద పిక్చర్స్’ పతాకంపై నిర్మితమైన ‘పండంటి కాపురం’ చిత్రానికి పి.లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించారు. జి.హనుమంతరావు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం 1972 జూలై 21న విడుదలై విజయభేరీ మోగించింది. కృష్ణ నటజీవితంలో తొలి రజతోత్సవంగా ఈ సినిమా నిలచింది.
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
‘పండంటి కాపురం’ టైటిల్ ను బట్టే ఇది కుటుంబకథా చిత్రం అని ఇట్టే తెలిసిపోతుంది. ఈ సినిమాను చూస్తే యన్టీఆర్ ‘ఉమ్మడికుటుంబం’, ఏయన్నార్ ‘తోడికోడళ్ళు’ గుర్తుకు రాకమానవు. ఎందుకంటే ఇది కూడా అన్నదమ్ముల చుట్టూ సాగే కథ. ఆ అన్నదమ్ములలో ఒకరివల్ల సంసారంలో సమస్యలు కలగడం, చివరకు వాటికి పరిష్కారం లభించడంతోనే ముందటి చిత్రాలు తెరకెక్కాయి. అదే తీరున ‘పండంటి కాపురం’ కూడా రూపొందింది. రంగుల్లో రూపొందిన ‘పండంటి కాపురం’ విశేషాదరణ చూరగొంది.
ఇంతకూ ‘పండంటి కాపురం’ కథ ఏమిటంటే – నారాయణరావు, శ్రీనివాసరావు, మధు, రవి నలుగురు అన్నదమ్ములు. అన్న నారాయణరావు మాటంటే మిగిలిన ముగ్గురికి వేదం. ఆ ఇంటిని పోషించే భారమంతా నారాయణరావుదే. శ్రీనివాసరావు ఓ చోట క్లర్క్ గా పనిచేస్తుంటాడు. తన అక్క కూతురు లక్ష్మిని పెళ్ళాడి ఉంటాడు. అతనికి ఇద్దరు పిల్లలు. మధు కలెక్టర్ అవుతాడు. అతను ధనవంతుల అమ్మాయి శోభను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. రవికి తన కూతురు సుశీలను ఇచ్చి పెళ్ళి చేయాలని చెంగయ్య ఆశిస్తాడు. అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ముల కాపురం రాణీ మాలినీ దేవి రాకతో చెదరిపోతుంది. ఆమె ఆ ఇంటిపై పగ పట్టడానికి కారణం నారాయణరావు పెద్దతమ్ముడు శ్రీనివాసరావు గతంలో ఆమెను ప్రేమించి, పెళ్ళి చేసుకోవాలనుకొని ఉంటాడు. వారికి ఓ బిడ్డ కూడా పుడుతుంది. ఆ బిడ్డ ఏమయిపోయిందో కూడా తెలియని మాలిని, ఓ కోటీశ్వరుని కూతురుగా ఆదరణ పొంది, ఆయన మరణం తరువాత ధనవంతురాలవుతుంది. తన ధనంతో పండంటి కాపురంలో కలతలు పెరిగేలా చేస్తుంది. శ్రీనివాసరావు ఉద్యోగం పోయేలా చేస్తుంది. వారి ఆస్తిని సొంతం చేసుకుంటుంది. అలా నారాయణరావు, అతని కుటుంబం పలు కష్టాల పాలవుతుంది. చివరకు శ్రీనివాసరావు పిల్లల్లో చిన్నవాడికి వైద్యం కూడా చేయించలేని పరిస్థితి. ఆ బాబు కన్నుమూస్తాడు. రవి వెళ్ళి మాలినిని నిలదీస్తాడు. తరువాత నారాయణరావు ద్వారా తన కూతురు బ్రతికే ఉందని, ఆమె ఆయన కూతురుగా చెలామణీ అవుతున్న శాంతి అని తెలుసుకుంటుంది మాలిని. తన వల్ల ఆ కుటుంబానికి నష్టం వాటిల్లిందని తెలుసుకొని పశ్చాత్తాప పడుతుంది. తన కారణంగానే పండంటి కాపురం విచ్ఛిన్నమైందని భావించిన శ్రీనివాసరావు ఆత్మహత్యాప్రయత్నం చేస్తాడు. తమ్ముళ్ళు పోయి రక్షిస్తారు. అందరినీ కలిపి తాను దైవసన్నిధానంలో శేషజీవితం గడుపుతానని మాలిని వెళ్తుంది. రవి, సుశీల కళ్యాణంతో కథ సుఖాంతమవుతుంది.
కృష్ణ- విజయనిర్మల జంటగా నటించిన ఈ చిత్రంలో యస్వీ రంగారావు, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, జమున, దేవిక, బి.సరోజాదేవి, రాజబాబు, అల్లు రామలింగయ్య, రామ్మోహన్, మిక్కిలినేని, సాక్షి రంగారావు, సంధ్యారాణి, రాధాకుమారి, బాలనటులు బేబీ డాలి, నరేశ్ కుమార్, నూతన తార సుజాత నటించారు. ఈ చిత్రానికి డాక్టర్ ఎమ్.ప్రభాకరరెడ్డి కథను సమకూర్చగా, మద్దిపట్ల సూరి మాటలు రాశారు. ఎస్.పి. కోదండపాణి స్వరకల్పనలో దాశరథి, సినారె, కొసరాజు, అప్పలాచార్య, గోపి రాసిన పాటలు అలరించాయి. ఇందులోని “బాబూ…వినరా… అన్నాదమ్ముల కథ ఒకటి…”, “ఈ నాడు కట్టుకున్న బొమ్మరిల్లు…”, “ఏమమ్మో జగడాల వదినమ్మో…”, “ఇదిగో దేవుడు చేసిన బొమ్మా…”, “మనసా కవ్వించకే నన్నిలా…” అంటూ సాగే పాటలు విశేషాదరణ చూరగొన్నాయి.
‘పండంటి కాపురం’ చిత్రం 21 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. వాటిలో రెండు షిఫ్ట్ సెంటర్స్ కాగా, మిగిలినవన్నీ డైరెక్ట్ గా నూరు రోజులు ఆడినవే. ఈ సినిమా డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ చూసింది. ఆ పై స్వర్ణోత్సవమూ పూర్తి చేసుకుంది. కృష్ణకు ఇదే తొలి స్వర్ణోత్సవం కావడం మరింత విశేషం! ఈ సినిమాలో సుజాతగా పరిచయమైన నటి, తరువాత జయసుధగా జయకేతనం ఎగురేశారు. ఇక బాలనటుడు నరేశ్ కుమార్ ఆ పై హీరోగా, ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో జయశంకర్ హీరోగా ‘అన్బు సహోదరగల్’ పేరుతో రీమేక్ చేశారు. అందులోనూ యస్వీఆర్ తన పాత్రను తానే పోషించారు. హిందీలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘సున్హేరా సన్సార్’గా రాజేంద్రకుమార్ తో తెరకెక్కించారు. తెలుగు కథకు కొన్ని మార్పులు చేర్పులతో హిందీ చిత్రం రూపొందింది. తమిళ, హిందీ భాషల్లోనూ ఈ కథ విజయం సాధించింది.









తాజావార్తలు
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!