Suryadevara Naga Vamsi: కొన్ని సంస్థలకు కొన్ని మాసాలు భలే కలిసి వస్తాయి. అలానే కొన్ని బ్యానర్స్ కు కొన్ని సీజన్స్ అచ్చి వస్తాయి. అప్పట్లో సంక్రాంతి అంటే ఎమ్మెస్ రాజుదే అని అనుకునేవారు. అలానే ‘దిల్’ రాజును సమ్మర్ రాజు అని ముద్దుగా పిలుచుకునే వారు. ఇక శివరాత్రి వచ్చిందంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళ సినిమా ఏదో ఒకటి విడుదలై, విజయం సాధిస్తుందని చెప్పుకునేవారు. అలా చూస్తే సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు ఫిబ్రవరి మాసం కలిసొచ్చినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సంస్థ తాజాగా నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’ సోమవారంతో విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుని ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. నిజానికి ధనుష్ నటించిన ఈ సినిమా విడుదల కాగానే కొందరు పెదవి విరిచారు. విద్యా వ్యవస్థలోని లోపాల నేపథ్యంలో అనేక చిత్రాలు ఇప్పటికే వచ్చాయి కాబట్టి దీనికి ప్రేక్షకాదరణ పెద్దంతగా లభించదని భావించారు. కానీ వారి అంచనాలను తల్లకిందులు చేస్తూ ‘సార్’ మూవీ తెలుగు, తమిళ భాషల్లో గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంది.
ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు ఫిబ్రవరి మాసం కలిసొచ్చిందని చెప్పుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీష్మ’ ఫిబ్రవరి 21, 2020న విడుదలై చక్కని విజయాన్ని సాధించింది. ఆ సినిమా మంచి ఊపులో ఉండగానే కరోనా ఫస్ట్ వేక్ కారణంగా థియేటర్లు మూత పడటంతో పూర్తి స్థాయి సక్సెస్ ను నిర్మాత పొందలేకపోయారు. అయితే ఆ లోటును గత యేడాది ఫిబ్రవరి 12న విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమా తీర్చేసింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కించిన ‘డీజే టిల్లు’ యూత్ ను విశేషంగా ఆకట్టుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఇక గత యేడాది ఫిబ్రవరి 25న వచ్చిన పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సూపర్ ఓపెనింగ్స్ ను పొందింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఖ్యాతిని పెంచింది. సో… గత యేడాది ఫిబ్రవరిలో వచ్చిన ఈ రెండు సినిమాలు సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు మంచి విజయాలను అందించాయి. ఇక ఆ సెంటిమెంట్ ను నిజం చేస్తూ… ఈ యేడాది ఫిబ్రవరి 17న వచ్చిన ‘సార్’ మూవీ సైతం చక్కని విజయాన్నే అందుకుంది. అయితే… దానికి ముందు ఫిబ్రవరి 4న వచ్చిన ‘బుట్టబొమ్మ’ మాత్రం పరాజయం పాలై నిరాశను కలిగించింది. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు… ఫిబ్రవరి సితార ఎంటర్ టైన్ మెంట్ కు కలిసొచ్చిన మాసంగా చెప్పుకోవాలి.