T.G. Viswaprasad: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి రాబోతున్న తాజా చిత్రం ‘రామబాణం’. మే 5న ఈ సినిమా జనం ముందుకు వస్తోంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. బ్రదర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని నిర్మాత వ్యక్తం చేశారు.
సోమవారం ప్రెస్ మీట్ లో టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ, “దాదాపు పదేళ్ళ క్రితమే పక్కా ప్రణాళికతో చిత్రసీమలోకి అడుగుపెట్టాను. మూడు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న నేను సాఫ్ట్ వేర్ రంగంతో పాటు పేషన్ తో సినిమా నిర్మాణంలోకి వచ్చాను. వివిధ భాషల్లో నంబర్ ఆఫ్ మూవీస్ చేయాలనేది నా కోరిక. అలానే ఫాస్టెస్ట్ హండ్రెడ్ మూవీస్ అనేది నా టార్గెట్. ఆ దిశగా చాలా వేగవంతంగా ముందుకు సాగుతున్నాం. ఇంతవరకూ 60, 70 సినిమాలు చేశాం. అలానే పదిహేనుకు పైగా చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. రాబోయే ఐదు సంవత్సరాలలో మరో 30, 40 చిత్రాలు తీయబోతున్నాం” అని అన్నారు. నెంబర్ ఆఫ్ మూవీస్ చేయడం ఎప్పుడు రిస్క్ కాదని, తాను దాని కారణంగా ఎప్పుడూ ఒత్తిడికి లోను కాలేదని, నిజానికి అదే సరైన విధానమని విశ్వప్రసాద్ తెలిపారు. ‘రామబాణం’ సినిమాకు ముందు గోపీచంద్, శ్రీవాస్ కాంబోలో వచ్చిన ‘లక్ష్యం, లౌక్యం’ సినిమాలు ఘన విజయం సాధించాయని, దాంతో ఈ మూవీతో హాట్రిక్ సాధించాలనే కృత నిశ్చయంతో శ్రీవాస్ ఉన్నారని విశ్వప్రసాద్ చెప్పారు. జగపతిబాబు, ఖుష్ బూ లాంటి పర్ ఫెక్ట్ ప్యాడింగ్ ఆర్టిస్టులతో యేడాది క్రితమే ఈ సినిమాను మొదలు పెట్టామని, అయితే అనివార్య కారణాల వల్ల విడుదలలో కొంత జాప్యం జరిగిందని, అయితే అది సినిమా క్వాలిటీ మీద ప్రభావం చూపదని తెలిపారు. ఈ సినిమాకు ‘రామబాణం’ పేరును బాలకృష్ణ సజెస్ట్ చేశారని ,కథకూ అది సూట్ అవుతుందని అన్నారు.
పవర్ స్టార్ మూవీ పేరు నిర్ణయించలేదు
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ బాటలో సాగుతోంది. ‘నిశ్శబ్దం’ మూవీలోనే హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ ఇన్వాల్వ్ అయ్యారు. అలానే పూర్తి స్థాయిలో ఆంగ్ల చిత్రాన్ని నిర్మించబోతోందీ సంస్థ. భారతదేశంలోనూ కన్నడ, తమిళతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఓటీటీ కోసం డైరెక్ట్ మూవీస్ ను, వెబ్ సీరిస్ ను నిర్మిస్తోంది. కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అయ్యి విశేష ఆదరణ పొందాయి. ఇటీవలే ఈ సంస్థ తమిళ మూవీ ‘వినోదాయ సీతంను తెలుగులో సముతిరకని దర్శకత్వంలో రీమేక్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఇంకా నిర్ణయించలేదని విశ్వప్రసాద్ తెలిపారు.
ప్రభాస్ సినిమా వివరాలకు సమయం ఉంది!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ ఫస్ట్ కాంబినేషన్ లోనూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమాను నిర్మిస్తోంది. దీనికి ‘రాజా డీలక్స్’ అనే పేరు ప్రచారంలో ఉన్నా… అధికారికంగా మాత్రం మేకర్స్ ఏ విషయాన్ని ఖరారు చేయడంలేదు. ఈ విషయంలోనూ విశ్వప్రసాద్ వ్యూహాత్మక మౌనం పాటించారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రభాస్ మూవీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని అన్నారు. ఈ యేడాదిలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’, ఆ వెనుకే ‘సలార్’ విడుదల కాబోతున్నాయి. వచ్చే సంక్రాంతి కానుకగా ‘ప్రాజెక్ట్ కె’ రానుంది. సో… ఈ యేడాదిలో ప్రభాస్ – మారుతీ మూవీ వస్తుందా? అన్న ప్రశ్నకూ ఆయన జవాబు దాటవేశారు. సినిమా షూటింగ్ జరుగుతోందని, సమయం వచ్చినప్పుడు అప్ డేట్స్ ఇస్తానని అన్నారు.
చిరంజీవి, బన్నీతోనూ సినిమాలు
ఇటీవల విశ్వప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిశారు. ‘వారితో సినిమాలు ప్లాన్ చేస్తున్నారా?’ అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, ”తెలుగులోని అగ్రతారలందరితోనూ సినిమాలు తీయాలన్నది మా ఆలోచన. అయితే… వారిని కలిసినంత మాత్రాన వెంటనే సినిమా ఉంటుందని కాదు. వారు కథ విని, డేట్స్ ఇచ్చినప్పుడు తప్పకుండా ప్రాజెక్ట్ టేకప్ చేస్తాం. ఈ రంగంలోకి వచ్చిందే అందరితో సత్ సంబంధాలు నెరపుతూ, క్వాలిటీ మూవీస్ నిర్మించడానికి. కాబట్టి ఈ ప్రాసెస్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది” అని అన్నారు. రాయలసీమ నేపథ్యం నుండి వచ్చిన తాను వ్యక్తులను ఆదర్శంగా పెట్టుకోలేదని, ఫిల్మ్ మేకింగ్ అనే పేషన్ తోనే ఈ రంగంలో అడుగుపెట్టానని, రాబోయే రోజుల్లోనూ నిర్మాతగా కొనసాగడం తప్పితే దర్శకత్వం వహించే ఆలోచన లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓటమి ఎదురైన ప్రతి సందర్భంలోనూ పోస్టో మార్టమ్ జరుగుతుందని, సినిమా నిర్మాణంలో ఎక్కడ ఏ తప్పు జరిగిందో విశ్లేషించుకోవడం వల్ల మరోసారి ఆ తప్పు చేయకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. తాను కేవలం డబ్బులు పెట్టే నిర్మాతగా ఉండిపోనని, ప్రతి ప్రాజెక్ట్ ఏ దశలో ఉంది, నిర్మాణం ఎలా సాగుతోంది అనేది పట్టించుకుంటానని, అయితే ఒకసారి ప్రాజెక్ట్ ను లాక్ చేసిన తర్వాత క్రియేటివ్ సైడ్ తాను ఇన్ వాల్వ్ కానని డైరెక్షన్ టీమ్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తానని తెలిపారు.