RC16: ఏ తల్లి అయినా కన్నబిడ్డల ఎదుగుదలను చూడాలనుకుంటుంది. బిడ్డ విజయాన్ని అందుకున్న రోజున ఆమె గురించి చెప్పే మాటలు వినాలని అనుకుంటుంది. అందాల అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూడా అలానే అనుకుంది. తనలా తన కూతురును కూడా పెద్ద స్టార్ ను చేయాలని ఎంతో ఆశపడింది. కూతురుకి అన్ని దగ్గర ఉండి నేర్పించి.. వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధం చేసింది. జాన్వీ కపూర్ త్వరలో లాంచ్ అవుతుంది అన్న సమయంలోనే ఆమె మృతిచెందింది. ఇది జాన్వీకి కోలుకోలేని దెబ్బ. వయస్సుకు వచ్చిన కూతురుకి తల్లి ప్రేమ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా ఇండస్ట్రీలో.. వెన్నుదండుగా ఉంటుంది అనుకున్న తల్లి మృతిచెందడంతో జాన్వీ కృంగిపోయింది. కానీ, తనకన్నా చిన్న వయస్సులో ఉన్న చెల్లిని చూసుకోవలసిన బాధ్యత తనపై ఉండడంతో స్ట్రాంగ్ గా నిలబడింది.
వరుస అవకాశాలను అందుకుని, విజయాపజయాలను లెక్కచేయకుండా కెరీర్ లో ముందుకు సాగుతుంది. ఇక తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాలతో ఎంటర్ అవుతుంది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న జాన్వీ.. ప్రస్తుతం RC16 లో రామ్ చరణ్ సరసన నటించడానికి రెడీ అయ్యింది. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. శ్రీదేవి, చిరు కాంబోలో వచ్చిన సినిమాలు ఎలాంటి రికార్డులు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన కొడుకు సరసన శ్రీదేవి కూతురు నటిస్తుంది. ఇది కూడా ఒక విజయమే అని చెప్పాలి. ఇలాంటి సమయంలో శ్రీదేవి ఉండి ఉంటే.. చరణ్- జాన్వీ లను పక్కన పెట్టి.. చిరు- శ్రీదేవి లనే అభిమానులు చూసేవారు. జగదేక వీరుడు – అతిలోక సుందరి మళ్లీ కలిసిన్నట్లు ఉండేది. ఒక మంచి బ్యానర్ లో.. స్టార్ హీరోల సరసన కూతురు నటిస్తుంది అంటే శ్రీదేవి ఆనందానికి అవధులు ఉండేవి కాదేమో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక వీరి మధ్య లేకపోయినా శ్రీదేవి పై నుంచి వీరిని ఆశీర్వదిస్తూనే ఉంటుంది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో జాన్వీ.. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటుందో లేదో చూడాలి.