మా హీరో సింహం లాంటోడు.. చిరుత లాంటి కళ్లు.. సింహం లాంటి పొగరు అంటూ అభిమానులు తమ అభిమాన హీరోలను పొగడడం చాలాసార్లు వింటూనే ఉంటాం. ఇక స్టార్ హీరో కొత్త సినిమా పోస్టర్ రావడం ఆలస్యం.. సింహాన్నో, పులినో పక్కనపెట్టి.. అడవికి రాజు సింహం.. ఇండస్ట్రీకి రాజు మా హీరో అంటూ ట్యాగ్ లైన్ జోడించి సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. దీంతో సినిమాల్లో సైతం హీరోలను అదే విధంగా ఎలివేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వారు సింహాలు, పులులు అయితే.. మరి మిగతావారు ఎవరు..? మిగతా హీరోలందరిని ఏ జంతువులతో పోల్చాలి.
అసలు హీరోలను జంతువులతో పోల్చే సాంప్రదాయం ఎవరితో వచ్చింది.. అప్పుడెప్పుడో నందమూరి తారక రామారావు నుంచి ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీకి సింహాన్ని తగిలేంచేశారు అభిమానులు. నందమూరి నట సింహం అంటూ బాలయ్యబాబుకు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేశారు . దీంతో ఆయన ప్రతి సినిమాలోనూ సింహం కు బ్రాండ్ అంబాసిడర్ గా బాలయ్యబాబును మార్చేశారు దర్శకులు.. ఇక బాలయ్య తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ తారక్ ని పులితో పోల్చేశారు. వీరి పోస్టర్స్ ఏది కనిపించిన పక్కన పులినో , సింహాన్నో పక్కనపెట్టి ఎడిట్ చేసేస్తున్నారు అభిమానులు..
ఇక ఈ ఫ్యామిలీ కాకుండా మెగా ఫ్యామిలీని కూడా ఇలాగే జంతువులతో పోల్చడం మొదలయ్యింది. చిరుత చిత్రంతో రామ్ చరణ్ ని చిరుతలా మార్చేశారు. ఇటీవల్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘భీమ్లా నాయక్’ లోని ఒక ఫోజ్ ని చిరుత పులిని పక్కన పెట్టి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. హీరోలను జంతువులతో పోల్చడం వలన అభిమానులకు వచ్చే ఆనందం ఏంటి..? అంటే.. అడవిలో ఏ జంతువూ అయితే గొప్పగా ఉంటుందో.. ఇండస్ట్రీలో ఆ హీరో గొప్ప అని చెప్పుకోవడానికి మాత్రమే అవి పనికి వస్తాయి.
ఇక స్టార్ హీరోల ఫ్యాన్స్ వార్స్ కి ఇవి కూడా కారణం అవుతున్నాయి. మా హీరో పులి అంటే.. ఏ మనిషి కాడా అని కౌంటర్లు.. మీ హీరో జంతువు అంటే మీ హీరో జంతువు అని కొట్టుకోవడానికి ఈ ఎడిట్ లు పనికి వస్తున్నాయి.
హీరోను హీరోలా చూడడం నేర్చుకోవాలి. సినిమా.. మూడుగంటలు వినోదాన్ని పంచే ఒక సాధనం.. అంతవరకే.. రియల్ గా వారు కూడా మనుషులే.. వారికి ఎమోషన్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాలి అని పలువురు వాదిస్తున్నారు. ఇక ఇలా అడివికి సింహం, చిరుత అని అనకుండా వారు పాల్గొనే సేవ కార్యక్రమాల్లో ఫ్యాన్స్ పాల్గొని వారి పేరును ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే బావుంటుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.