Hebah Patel: దాదాపు ఎనిమిదేళ్ళ క్రితం ‘అలా ఎలా’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ హెబ్బా పటేల్. తొలి చిత్రంతోనే చక్కని గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ డస్కీ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి. విశేషం ఏమంటే… సుకుమార్ లాంటి దర్శకుడు తాను నిర్మాతగా మారి, కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ తీసిన ‘కుమారి 21 ఎఫ్’లో నాయికగా హెబ్బా పటేల్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక అమ్మడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.
డౌన్ టూ ఎర్త్ ఉండే హెబ్బా పటేల్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దాంతో… ”ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్” వంటి విజయవంతమైన చిత్రాలలో ఆమెకు చోటు దక్కింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఆ తర్వాత హెబ్బాకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఆమె నటించిన ‘మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిసెస్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయినా… హెబ్బాకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో హెబ్బా పటేల్ తన రూట్ మార్చింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా, ఐటమ్ సాంగ్స్ కూ సై అంది. అలా రామ్ హీరోగా నటించిన ‘రెడ్’లో హెబ్బా ఐటమ్ సాంగ్ చేసింది. గత యేడాది వచ్చిన ‘శాసనసభ’లో స్పెషల్ సాంగ్ చేసింది.
అదే సమయంలో హెబ్బా పటేల్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రాలు నటిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీ చూసిన వాళ్ళు ఆమె కత్తికి రెండు వైపులా పదును అనే విషయాన్ని అంగీకరించారు. ఆ క్రమంలోనే లేడీ ఒరియెంటెడ్ మూవీస్ పై హెబ్బా దృష్టి పెట్టింది. వినాయక్ శిష్యుడు తెరకెక్కించిన ‘గీత’ చిత్రంలో నటించింది. ఆ మూవీ లాస్ట్ ఇయర్ విడుదలైంది. త్వరలో విడుదల కాబోతున్న ‘తెలిసిన వాళ్ళు’ సినిమాలోనూ హెబ్బాది కీ-రోల్! ఇక ‘బ్లాక్ అండ్ వైట్’, ‘అలా నిన్ను చేరి’ సినిమాల్లోనూ హెబ్బా పటేల్ నాయికగా నటిస్తోంది. ఈ తెలుగు సినిమాలతో పాటు రెండు తమిళ చిత్రాలలోనూ యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె కిట్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లేకపోయినా… వీటిల్లో ఏ రెండు మూడు చిత్రాలు హిట్ అయినా మరికొన్ని అవకాశాలు రావడం ఖాయం. జనవరి 6వ తేదీతో 34వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న హెబ్బా పటేల్ ఇంకెంత కాలం గ్లామర్ పాత్రలతో రాణిస్తుందో చూడాలి.