Ravanasura: మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ చిత్రం ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తం ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజతో పాటు అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించారు. ఈ సందర్భంగా హర్షవర్థన్ మాట్లాడుతూ, “మాది రాజమండ్రి. చెన్నై లో స్థిరపడడం. మా నాన్న గారు ప్రముఖ రిధమ్ ప్లేయర్. ఎంతోమంది సంగీత దర్శకుల వద్ద పని చేశారు. నేను రిధమ్ ప్లేయర్ గా కెరీర్ మొదలుపెట్టాను. తర్వాత ప్రోగ్రామింగ్ లో పని చేశా. కన్నడ లో హరికృష్ణ గారి దగ్గర ఏడేళ్ళు పని చేశాను. తర్వాత జిబ్రాన్, రధన్, దేవగారు ఇలా చాలా మంది దగ్గర చేశాను. ‘అర్జున్ రెడ్డి’ చేసినప్పుడు పాటలతో పాటు బీజీఎం కి వర్క్ చేశాను. సందీప్ గారు నా పని గుర్తించి స్క్రీన్ పై పేరు వేశారు” అని చెప్పారు.
‘రావణాసుర’ మూవీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారో చెబుతూ, “అభిషేక్ గారి ప్రొడక్షన్ లో ‘డెవిల్’ సినిమా చేస్తున్నాను. ఒక రోజు ఆయన కాల్ చేసి ‘రావణాసుర’ టైటిల్ ఎలా వుందని అడిగారు. చాలా పవర్ ఫుల్ టైటిల్ అని చెప్పాను. దీనికి థీమ్ సాంగ్ కావాలని కొన్ని వివరాలు చెప్పారు. ఒక ట్యూన్ చేసి పంపించాను. కొన్ని రోజులు తర్వాత ఒక రోజు స్టూడియోకి అభిషేక్ గారు, సుధీర్ వర్మ గారు వచ్చారు. ‘రావణాసుర’కి నువ్వే మ్యూజిక్ చేస్తున్నావని చెప్పారు. నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. వెంటనే మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో రవితేజ గారు హీరో అని చెప్పారు. నా మైండ్ బ్లాంక్ అయిపొయింది. రవితేజ గారికి పెద్ద ఫ్యాన్ ని. రవితేజ గారి సినిమాకి పని చేయడం డ్రీమ్ కం ట్రూ మూమెంట్. ఈ సినిమాలో నేను నాలుగు పాటలకు స్వరాలు సమకూర్చి నేపథ్య సంగీతం అందించాను. భీమ్స్ ఐటమ్ సాంగ్ కంపోజ్ చేశారు” అని తెలిపారు. ‘వెయ్యినొక్క జిల్లాల’ పాట రీమిక్స్ గురించి చెబుతూ, “ఇళయరాజా గారి పాటని రీమిక్స్ చేయడం ఒక సవాల్. అంతేకాదు అది కష్టంతో కూడుకున్న పని. రాజా గారు దీనిని మేజర్ స్కేల్ లో చేశారు. నేను రవితేజ గారి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని మైనర్ స్కేల్ లో ఒక ట్యూన్ చేశాను. అది అందరికీ నచ్చింది. ఈపాట రీమేక్ చేయడానికి కారణం కథలో ఆ సందర్భం వుంది” అని అన్నారు.
‘అర్జున్ రెడ్డి’తో వచ్చిన ఫేం గురించి చెబుతూ, “అది నా కెరీర్ కి పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. ‘అర్జున్ రెడ్డి’ని బేస్ చేసుకునే ఇప్పటికీ నన్ను సంప్రదిస్తున్నారు. ఆ మూవీ తర్వాత ‘జార్జ్ రెడ్డి’లో మంచి మ్యూజిక్ చేసే అవకాశం దక్కింది. ఈ రెండు సినిమాల తర్వాత సంగీత దర్శకుడిగా ‘రావణాసుర’ నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘డెవిల్’, సందీప్ ‘యానిమల్’ సినిమాలకి పని చేస్తున్నాను” అని చెప్పారు.