జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ‘టిల్లు వేణు’ దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ‘బలగం’. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చెయ్యడం విశేషం. బలగం సినిమా అన్ని సెంటర్స్ లో ‘గొప్ప సినిమా’ అనే కాంప్లిమెంట్స్ ని అందుకుంటుంది. దర్శకుడిగా కల్చర్ లోని రూట్స్ ని చూపిస్తూ టిల్లు వేణు చేసిన ఈ సినిమా కథ నాది అంటూ ‘సతీష్’ అనే జర్నలిస్ట్ టర్న్డ్ రైటర్ క్లైమ్ చేశాడు. ప్రెస్ మీట్ పెట్టి మరీ దిల్ రాజుని, వేణుకి విమర్శించడంతో వేణు కాంట్రవర్షియల్ ప్రెస్ మీట్ పెట్టాడు.
“బలగం సినిమాని ముందుకి తీసుకోని వెళ్తున్న ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు. ఈరోజు మీడియాతో సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం సతీష్ అనే అతను, బలగం కథ నాది అంటూ మీడియా ముందుకి వచ్చాడు. అసలు బలగం అనేది సినిమా కథనే కాదు. ఇది తెలంగాణాలో, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉన్న కల్చర్. ఇవి మన రూట్స్. 2000లో మా నాన్న చనిపోయినప్పుడు జరిగిన విషయాలని చూసి నాకు ఈ కథ ఆలోచన కలిగింది. మన ఇంట్లో ఎవరు చనిపోయినా పాటించే కార్యక్రమాలనే బలగం సినిమాలో చూపించాను. నా కుటుంబం చాలా పెద్దది, మా నాన్న చనిపోయినప్పుడు, పెద్దమ్మ చనిపోయినప్పుడు జరిగిన విషయాలు ప్రతి ఇంట్లో జరిగే ఉంటాయి. అదే సినిమాలో చూపించాను. కాకి పిండాన్ని ముట్టడం అనేది కల్చర్ లో భాగంగా జరిగే ప్రక్రియ, ఇది ఏ ఒక్కరికీ సొంతం కాదు. ఈరోజు నేను రాసుకున్నా, రేపు ఇంకొకరు రాసుకోవచ్చు. అంతేకాని ఇది నాది అనే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ సతీష్ తన కథని నేను కాపీ చేశాను అనుకుంటే రైటర్స్ అసోషియేషన్ కి కానీ లీగల్ గా కానీ ప్రొసీడ్ అవ్వాలి అంతే కానీ చిన్న సినిమాని కేవలం కథని నమ్మి ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజుని విమర్శించడం తప్పు. నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, అక్కడ చూసుకుందాం. ఆరు సంవత్సరాల కెరీర్ ని పణంగా పెట్టి, నా జీవితంలో జరిగిన విషయాలని సినిమా కథగా మార్చి బలగం సినిమా చేశాను. ఇది నాదీ అని సతీష్ అనడం తప్పు. ఈ కథ రాసుకునే విషయంలో జాతిరత్నాలు దర్శకుడు కేవీ అనుదీప్ ఎంతో హెల్ప్ చేశాడు. లోకేషన్స్ ని వెతకడంలో, అందరినీ కలిసి సమాచారాన్ని సేకరించే సమయంలో అనుదీప్ నాకు ఎంతగానో సపోర్ట్ చేశాడు. బలగం సినిమా ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని వేణు చెప్పాడు.