Surya Kiran: టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి చెందిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక కంటికి పచ్చ కామెర్లు కావడంతో పరిస్థితి విషమించి కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందారు. తెలుగు, తమిళ్ భాషల్లో సూర్యకిరణ్ చాలా మంచి చిత్రాల్లో నటించడమే కాదు.. మంచి సినిమాలను కూడా తెరకెక్కించారు. అయితే ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1977 లో టీఎస్ మణి, రాధ అనే జంటకు పెద్ద కొడుకుగా సూర్యకిరణ్ జన్మించాడు. ఇతని చెల్లెల్లు సుజిత కూడా నటిగా కొనసాగుతోంది. ఈ ఇద్దరు అన్నాచెల్లెలు బాల నటులుగా కెరీర్ ను మొదలుపెట్టారు. మాస్టర్ సురేష్ గా తమిళ్ లో సూర్యకిరణ్ మంచి పేరు ఉంది. స్టార్ హీరోల అన్ని సినిమాల్లో చిన్నప్పటి హీరో సూర్యకిరణే అని చెప్పాలి. బాలనటుడిగా రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నాడు.ఇక సుజిత.. తెలుగులో చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో బాలనటిగా నటించింది. అమ్మాయి అయినా కూడా అందులో అబ్బాయిలా నటించి మెప్పించింది. అలా ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో బిజీ అయ్యారు.
ఇక సూర్యకిరణ్ డైరెక్టర్ కాకముందే హీరోయిన్ కళ్యాణిని ఇష్టపడ్డాడు. వీరిద్దరూ కలిసి నటించింది కూడా లేదు. పెదబాబు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా నిర్మాతతో మాట్లాడడానికి వచ్చిన సూర్య కిరణ్ అప్పుడే మొదటిసారి కళ్యానిని కలిశారు. ఆ తరువాత ఇతర సినిమాల మీటింగ్ లలో కూడా వారి పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరు మళయాళీ కావడంతో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఎంత సైలెంట్ గా చేసుకున్నారో.. విడాకులు కూడా అంతే సైలెంట్ గా తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వలనే వీరు విడిపోయారని సుజిత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విడిపోయి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా నా గుండెల్లో ఆమెనే ఉందని సూర్య కిరణ్ ఎన్నోఇంటర్వ్యూలలో తెలిపాడు.
సత్యం సినిమాతో సూర్యకిరణ్ డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా అతనికి మంచి విజయాన్ని తీసుకొచ్చిపెట్టింది. ముఖ్యంగా చక్రి పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా తరువాత ధనా 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్ చాప్టర్ 6 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సినిమాలు ప్లాప్ అవ్వడంతో సూర్యకిరణ్ ఆర్థిక పరిస్థితి దెబ్బ తిన్నది. దానివల్లనే కళ్యాణితో గొడవలు వచ్చి విడిపోయినట్లు సూర్యకిరణ్ చెల్లి సుజిత తెలిపింది. ఇక మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన 2020 .. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ప్రత్యేక్షమయ్యాడు. హౌస్ లో కొన్నిరోజులు మాత్రమే ఉన్నా కూడా అందరిని తన మాటలతో మెప్పించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. బిగ్ బాస్ తరువాత మీడియా ముందుకు ఆయన రాలేదు. చిన్న వయస్సులోనే ఆయన మృతి చెందడం ఎంతో ఆవేదనకు గురిచేస్తుందని పలువురు ప్రముఖులు తెలుపుతున్నారు.