Surender Reddy Birthday: అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ ట్రైలర్ చూసిన వారికి అందులోని యాక్షన్ పార్ట్ నచ్చి ఉంటుంది. అది చూడగానే డైరెక్టర్ ఎవరా అని చూస్తే కనిపించే పేరు – సురేందర్ రెడ్డి. అయితే ‘సరే’… సురేందర్ రెడ్డి సినిమా అంటే ఆ మాత్రం యాక్షన్ ఉండి తీరుతుందని సగటు ప్రేక్షకుడు ఇట్టే నిర్ణయించేసుకుంటాడు. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలో యాక్షన్ లోనూ వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి. అందుకే సురేందర్ రెడ్డి పేరు వినగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలవుతూ ఉంటుంది.
కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి స్వగ్రామం. 1975 డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వీరారెడ్డి వారి గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు. సురేందర్ రెడ్డికి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి ఉండేది. డిగ్రీ చదువుతూ ఆపేసి, హైదరాబాద్ చేరి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. క్రాంతికుమార్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. తరువాత సొంతగా ‘అతనొక్కడే’ సబ్జెక్ట్ తయారు చేసుకొని, నందమూరి కళ్యాణ్ రామ్ కు వినిపించారు. కళ్యాణ్ తానే నిర్మాతగా ఆ చిత్రాన్ని నిర్మిస్తూ నటించారు. ఈ చిత్రంలో సురేందర్ రెడ్డి టేకింగ్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ కు తొలి హిట్ గా ‘అతనొక్కడే’ నిలచింది. మొదటి సినిమాతోనే విజయం సాధించిన సురేందర్ కు మంచి అవకాశాలు లభించాయి. రెండవ చిత్రమే జూనియర్ యన్టీఆర్ తో తెరకెక్కించే ఛాన్స్ దక్కింది. జూనియర్ యన్టీఆర్ తో ‘అశోక్’, తరువాత మహేశ్ బాబుతో ‘అతిథి’ రూపొందించారు. రవితేజ, ఇలియానా జంటగా సురేందర్ తెరకెక్కించిన ‘కిక్’ మంచి విజయం సాధించింది. మళ్ళీ జూనియర్ యన్టీఆర్ తో ‘ఊసరవెల్లి’ రూపొందించారు సురేందర్ రెడ్డి. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అల్లు అర్జున్ తో ఆయన రూపొందించిన ‘రేసు గుర్రం’ బంపర్ హిట్ అయింది.
రవితేజ హీరోగా ‘కిక్-2’ చిత్రాన్ని తన తొలి నిర్మాత కళ్యాణ్ రామ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అది అంతగా అలరించలేకపోయింది. తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్’ ఆధారంగా రామ్ చరణ్ తో ‘ధ్రువ’ రూపొందించారు సురేందర్. ఈ సినిమా సమయంలోనే రామ్ చరణ్ తో సురేందర్ రెడ్డికి మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో తన తండ్రి చిరంజీవి హీరోగా తాను నిర్మిస్తోన్న చారిత్రక చిత్రం ‘సైరా…నరసింహారెడ్డి’కి సురేందర్ రెడ్డిని దర్శకునిగా ఎంచుకున్నారు రామ్ చరణ్. ‘సైరా’ రూపకల్పనలో దర్శకునిగా సురేందర్ మంచి మార్కులే సంపాదించారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా ‘ఏజెంట్’తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉన్నారు సురేందర్. ఇప్పటికే అక్కినేని ఫ్యాన్స్ ఈ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో అఖిల్ తప్పకుండా మాస్ ఫాలోయింగ్ పెంచుకుంటారని అభిమానుల అభిలాష. మరి సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’తో అఖిల్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తారో చూడాలి.
(డిసెంబర్ 7న దర్శకుడు సురేందర్ రెడ్డి బర్త్ డే)