ఈ తరం వారికి దర్శకుడు శరత్ అంతగా తెలియకపోవచ్చు. కానీ శరత్ తెరకెక్కించిన సూపర్ హిట్స్ పేరు వింటే ఆయనా ఈ సినిమాలకు దర్శకుడు అని ఆశ్చర్యపోతారు. బాలకృష్ణతో పెద్దన్నయ్య, వంశానికొక్కడు వంటి సూపర్ హిట్స్ తీశారు. సుమన్‌తో బావ-బావమరిది, పెద్దింటి అల్లుడు, చిన్నల్లుడు వంటి విజయవంతమైన సినిమాలు రూపొందించారు. మహానటుడు ఏఎన్నార్ తో కాలేజీ బుల్లోడు, నటశేఖర కృష్ణతో సూపర్ మొగుడు లాంటి చిత్రాలు తీశారు. శరత్ మరణవార్త ఆయనతో పనిచేసిన వారికి దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన మంచితనాన్ని, పనితీరును గుర్తు చేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
శరత్ 1947 ఆగస్టు 25న కృష్ణా జిల్లా డోకిపర్రులో జన్మించారు. చదువు కొనే రోజుల నుంచే ఎన్టీఆర్, ఏయన్నార్ సినిమాలు చూస్తూ చిత్రసీమపై ఆసక్తి పెంచుకున్నారు. పి.సాంబశివరావు, ఎ.కోదండరామిరెడ్డి వంటి దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేశారాయన. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన పలు నవలా చిత్రాలకు శరత్ పనిచేయడంతో సూర్యదేవర రామ్మోహనరావు రాసిన ‘డియర్’ అనే నవలతో తన చిత్ర ప్రయాణం మొదలు పెట్టారు. డియర్ ఆధారంగా చాదస్తపు మొగుడు తెరకెక్కించిన శరత్‌కు తొలి చిత్రంతోనే మంచి దర్శకునిగా పేరొచ్చింది. తరువాత సుమన్ హీరోగా రూపొందిన పెద్దింటి అల్లుడు, బావ-బావమరిది వంటి హిట్ మూవీస్ రూపొందించారు శరత్. బావ-బావమరిది వంటి సూపర్ హిట్ తీయడం వల్లే బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో సినిమా తీసే అవకాశం లభించింది. బాలకృష్ణతో శరత్ రూపొందించిన తొలి చిత్రం ‘వంశానికొక్కడు’. ఈ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత బాలకృష్ణతో తెరకెక్కించిన ‘పెద్దన్నయ్య’ సూపర్ హిట్‌గా నిలిచి 1997 పొంగల్ హిట్‌గా నిలచింది. ఆపై బాలకృష్ణతో శరత్ తెరకెక్కించిన సుల్తాన్, వంశోద్ధారకుడు చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి.
బాలకృష్ణతో శరత్ తెరకెక్కించిన నాలుగు చిత్రాలు గుంటూరులో డైరెక్ట్ గా శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. సుమన్‌తో ఎక్కువ చిత్రాలు రూపొందించారు శరత్. సుమన్ తో తెరకెక్కించిన ‘బావ-బావమరిది’ సూపర్ హిట్ గా నిలవడమే కాదు, సుమన్‌కు ఉత్తమ నటునిగా నంది అవార్డు సంపాదించి పెట్టింది. కృష్ణతో ‘సూపర్ మొగుడు’ రూపొందించిన శరత్, ఏఎన్నార్ తో ‘కాలేజీ బుల్లోడు’ తెరకెక్కించారు. ఈ సినిమాలు సైతం ఆకట్టుకున్నాయి. దాదాపు పాతికపైగా చిత్రాలకు శరత్ దర్శకత్వం వహించారు.
శరత్ చిత్రాలలో ఎక్కువగా కుటుంబకథలే ఉండేవి. సెంటిమెంట్‌ను పండించడంలో మేటి అని ఆయన నిరూపించుకున్నారు. బాలకృష్ణ, సుమన్ తో ఆయన తెరకెక్కించిన చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కథను నేరుగా ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో శరత్ సిద్ధహస్తుడు. ఎవరినీ నొప్పించకుండా తన పని తాను చేసుకుంటూ పోయేవారు. నటీనటుల నుండి నటన రాబట్టడంలోనూ, రచయితలు, గీత రచయితలతో తనకు కావలసిన పదాలు పలికించుకోవడంలోనూ శరత్ సరదాగా ఉండేవారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ పని చేసుకునేవారు.
శరత్ ఆరంభంలో వరుస విజయాలు చవిచూశారు. తరువాతి రోజుల్లో పరాజయాలు పలకరించాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం శ్రీహరి హీరోగా నటించిన ‘ఎవడ్రా రౌడీ?’. ఆ తరువాత శరత్ ఏ చిత్రానికీ దర్శకత్వం వహించలేదు. ఆయనతో ఎక్కువ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సుధాకర్ రెడ్డి మంచి స్నేహితుడు. వారిద్దరి అనుబంధం గురించి అప్పట్లో విశేషంగా చెప్పుకొనేవారు. శరత్ పార్థివదేహం వద్ద కూడా సుధాకర్ రెడ్డి ఉన్నారు. శనివారం (ఏప్రిల్ 2) శరత్ అంత్యక్రియలు జరగనున్నాయి. శరత్ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ, సుమన్, కాట్రగడ్డ ప్రసాద్, ఏ.కోదండరామిరెడ్డి వంటి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.