ఇండియన్ సినిమా జెండాని ప్రపంచస్థాయిలో ఎగరేస్తున్న దర్శకుడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ లో నిలబెట్టడానికి చేయాల్సిందంతా చేస్తున్న జక్కన, ప్రస్తుతం అమెరికాలో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట ట్రిపుల్ ఆర్ సినిమాని ప్రమోట్ చేస్తున్న రాజమౌళి ఇటివలే జరిగినే ఒక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు. మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ ‘కెవిన్ ఫీజ్’ నుంచి ఒక మర్వెల్ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం రాజమౌళికి వచ్చిందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ విషయంపై స్పందించిన రాజమౌళి… “హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి కానీ తెలుగులో సూపర్ స్టార్ అయిన మహేశ్ బాబుతో ఒక సినిమా కమిట్ అయ్యి ఉన్నాను. ఆ తర్వాత తప్పకుండా ఓ హాలీవుడ్ సినిమా చేస్తా. కానీ అంతకంటే ముందు కొన్ని హాలీవుడ్ సినిమాల్ని స్టడీ చేయాలనుకుంటున్నా. వాళ్ల శైలి తెలుసుకోవాలి. మేకింగ్ పరంగా వాళ్లు ఎలాంటి మెథడ్స్ వాడుతున్నారు వంటి విషయాలపై పూర్తిగా నాలెడ్జ్ ఉండాలి. లేకపోతే వారి శైలిలో సినిమాలు చేయడం చాలా కష్టం. మన మేకింగ్ విధానానికి… ఇంగ్లీష్ సినిమాల మేకింగ్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాటిని చాలా దగ్గరగా పరిశీలిస్తే తప్ప తెలియదు” అంటూ సమాధానం ఇచ్చాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ తో ఇండియన్ సినిమాకి పాన్ వరల్డ్ గుర్తింపు తెచ్చిన రాజమౌళి, త్వరలో హాలీవుడ్ సినిమా చేసి అక్కడ కూడా తన రాజముద్రని వేస్తాడేమో చూడాలి.