‘నేను సినిమాకి రాస్తున్న ప్రేమలేఖ’. ఇది వినగానే ఏదో సినిమాకి సంబంధించిన టైటిల్ అనుకునే ప్రమాదం ఉంది. ఎంత మాత్రం కాదు. ఇది ఓ పుస్తకం పేరు. దీనిని రాస్తున్నది ఎవరో కాదు… టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. నిజానికి ఈ పుస్తకం విడుదల కూడా జరిగిపోయింది. శుక్రవారం సాయంత్రం దసపల్లాలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో ఇన్ఫోసిస్ చైర్ పర్శన్ సుధాకృష్ణమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని కీరవాణి అందుకున్నారు.
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పులువురు ప్రముఖలకు కూడా అందచేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ ఎన్.వి.రమణ వీడియో ద్వారా కె. రాఘవేంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరినీ డైరక్ట్ చేశారు. మూడు తరాల హీరోలతో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. పలువురు కొత్తవారినీ పరిచయం చేశారు. హీరోయిన్స్ ని అందంగా చూపించడంలో ఆయనను మించిన వారు లేరనే చెప్పాలి. అటు పాత తరానికి ఇటు కొత్త తరాలకు వారధిగా రాఘవేంద్రరావును చెప్పుకోవచ్చు. ఇక దాదాపు రెండువందల పేజీలున్న ఈ పుస్తకంలో తన కెరీర్ లో చేసిన ప్రయోగాలను, అందుకున్న ప్రశంసలను, ఎదురైన అవమానాలను పొందుపరిచారు రాఘవేంద్రరావు. కె. రాఘవేంద్రరావు రాసిన ఈ ప్రేమ లేఖ పుస్తకం త్వరలోనే అందుబాటులోకి రానుంది. అప్పుడు ఈ పుస్తకం గురించి కూలంకషంగా చర్చించుకుందాం.