వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మించిన సినిమా ‘గని’. ఈ నెల 8న విడుదల కాబోతున్న ఈ మూవీతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని కిరణ్ వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అల్లు అర్జున్ సహా మిగిలిన వారు సినిమాను అప్పటికే చూశారని, అందువల్లే వారు విజయంపై అంత కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేశారని కిరణ్ అన్నాడు.
కెరీర్ గురించి కిరణ్ మాట్లాడుతూ, ‘తన తండ్రి ‘ట్రేడ్ గైడ్’ వెంకటేశ్వరరావు కారణంగా చిన్నతనం నుండే సినిమాల పట్ల మక్కువ పెరిగిందని, చెన్నయ్ లో ప్రీమియర్ షోస్ బాగా చూసేవాడినని, అయితే హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన తర్వాతే దర్శకుడు కావాలనే కోరిక కలిగింద’ని అన్నారు. వి. వి. వినాయక్, జయంత్, హరీశ్ శంకర్, శ్రీను వైట్ల, లారెన్స్ దగ్గర దర్శకత్వ శాఖలో కొన్నేళ్ళు పని చేశానని చెప్పారు. చివరిగా ‘తొలిప్రేమ’కు వెంకీ అట్లూరి దగ్గర వర్క్ చేశానని అన్నారు. రవితేజ ప్రోత్సాహంతో ఆయన చిత్రాలకూ పనిచేసిన అనుభవం ఉందని చెప్పారు. కొంతకాలం దర్శకత్వ శాఖలో పనిచేసి దర్శకుడిగా సినిమా చేయాలనే ప్రయత్నాలు చేశానని, అవి సఫలీకృతం కాలేదని దాంతో మనసు మార్చుకుని నల్లమలుపు బుజ్జి సహకారంతో ‘మిస్టర్’కు కో-డైరెక్టర్ గా చేరానని అన్నారు. ఆ సమయంలో వరుణ్ తేజ్ తో మొదలైన పరిచయం ‘గని’ చిత్ర రూపకల్పనకు దారి తీసిందని తెలిపారు. ‘తొలిప్రేమ’ మూవీ చివరి రోజున వరుణ్ తేజ్.. తమన్ సంగీత దర్శకుడిగా, జార్జ్ కెమెరామేన్ గా తనతో సినిమా చేస్తానని ప్రకటించారని చెప్పారు. నిజానికి తన దగ్గర అప్పటికి కథేలేదని, కేవలం తనపైన నమ్మకంతోనే వరుణ్ తేజ్ ఆ ప్రకటన చేశారని అన్నారు.
‘గద్దలకొండ గణేశ్’ పాత్ర కోసం దాదాపు పదిహేను కేజీల బరువు పెరిగిన వరుణ్ తేజ్… ‘గని’ లోని బాక్సర్ పాత్ర కోసం బాగా తగ్గారని, సిక్స్ ప్యాక్ ను దాదాపు మూడేళ్ళ పాటు మెయిన్ టైన్ చేశారని, ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమను మాటల్లో వర్ణించలేమని కిరణ్ అన్నారు. పాత్రలను దృష్టిలో పెట్టుకునే పరభాషా నటులను ఎంచుకున్నామని, ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నదియా పాత్రలు సినిమాలో చాలా కీలకమైనవి చెప్పారు. స్పోర్ట్స్ డ్రామా ఏదైనా జీరోతో మొదలయ్యి హీరోగా మారడంతో పూర్తవుతుందని, అయితే అలాంటి ఓ బాక్సర్ కథను స్ఫూర్తిదాయకంగా మలిచామని, ‘గని’ అనే వ్యక్తి జర్నీ చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. తెలుగుతో పాటు కన్నడలోనూ ఈ నెల 8న విడుదల చేస్తున్నామని, రెండు వారాల తర్వాత తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తామని అన్నారు. కరోనా తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని చెబుతూ, ‘ఒకానొక సమయంలో తాను ఓటీటీ రిలీజ్ కు మొగ్గు చూపానని, కానీ నిర్మాతలు అందుకు అంగీకరించలేదని, ఇలాంటి సినిమాలను థియేటర్ లోనే చూడాలని వారు భావించార’ని అన్నారు. తొలి చిత్రం విడుదలకు ముందే ఇద్దరు నిర్మాతలు తనతో సినిమా తీయడానికి ముందుకొచ్చారని, చెరుకూరి సుధాకర్ తో పాటు భగవాన్ – పుల్లారావు సినిమా చేస్తామన్నారని, అలానే వరుణ్ తేజ్ సైతం తనతో మరో చిత్రం చేయబోతున్నారని కిరణ్ చెప్పారు.