Jayadev: టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్.. గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోనే నివాసముంటున్న జయదేవ్ కు.. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జయదేవ్ కు భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
ప్రముఖ దర్శకుడు, జర్నలిస్టు కేఎన్‌టీ శాస్త్రి చిన్న కొడుకే ఈ జయదేవ్. జర్నలిస్ట్ గా చేస్తూనే.. కోరంగి నుంచి అనే సినిమాకు జయదేవ్ దర్శకత్వం వహించాడు. నిరీక్షణ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అర్చన ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) నిర్మించింది. ఇక రిలీజ్ అయ్యాక ఈ చిత్రం ఎన్నో నేషనల్ అవార్డులను అందుకుంది.