నటిగా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలో తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించింది డింపుల్ హయతీ. విజయవాడలో పుట్టి హైదరాబాద్ లో పెరిగిన డింపుల్ కు ఈ యేడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ నెలలో ఆమె సినిమాలు ‘సామాన్యుడు’, ‘ఖిలాడీ’ బ్యాక్ టూ బ్యాక్ విడుదలయ్యాయి. విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ‘సామాన్యుడు’ మూవీ తమిళ, తెలుగు, కన్నడ, మలయళ, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే ఎక్కడా ఈ మూవీకి ఆశించిన స్థాయి సక్సెస్ దక్కలేదు. దేశ వ్యాప్తంగా తన సినిమా విడుదలైందన్న తృప్తి తప్పితే డింపుల్ కు ఇంకేమీ దక్కలేదు.
ఇక గత శుక్రవారం వచ్చిన ‘ఖిలాడీ’ కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా కూడా తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలైంది. గత యేడాది డిసెంబర్ 24న డింపుల్ నటించిన డైరెక్ట్ హిందీ సినిమా ‘అత్రంగీ రే’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ రకంగా వరుసగా మూడు చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైన డింపుల్ హయతీకి మరి బాలీవుడ్ లో ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇదిలా ఉంటే ప్రేమికుల రోజున ఓ వ్యక్తి డింపుల్ ను కాస్తంత కంగారు పెట్టాడు. సెల్ నంబర్ ను ఆమె పేరుతో క్రియేట్ చేసి, హల్చల్ చేయడం డింపుల్ దృష్టిలో పడింది. దానితో సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులందరినీ అలర్ట్ చేసింది. ఆ నంబర్ కు స్పందించవద్దని, అవకాశం ఉంటే దానిని బ్లాక్ చేయడంతో పాటు అతనిపై ఫిర్యాదు చేయమని కోరింది. ఏదేమైనా… అటు ‘సామాన్యుడు’, ఇటు ‘ఖిలాడీ’ ఇద్దరూ ఆమెకు సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయారన్నది వాస్తవం.