ప్రిన్స్ మహశ్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘పోకిరి, బిజినెస్ మ్యాన్’ తర్వాత మూడో సినిమాగా ‘జనగణమన’ రావాల్సింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను పూరీ జగన్నాథ్ 2016 ఏప్రిల్ 28న చేశాడు. అది ‘పోకిరి’ రిలీజ్ డేట్! ‘పోకిరి’ని మించి క్రూరంగా, ‘బిజినెస్ మ్యాన్’ను మించి పవర్ ఫుల్ గా ఇందులో మహేశ్ బాబు క్యారెక్టర్ ఉంటుందని పూరి జగన్నాథ్ ఆ టైమ్ లో చెప్పాడు. అయితే చూస్తుండగానే ఐదేళ్ళు గడిచిపోయాయి. మధ్యలో పూరిని ‘జనగణమన’ ప్రాజెక్ట్ గురించి అడితే, ‘ఉంటుంది’ అనే సమాధానం చెప్పాడు తప్పితే ‘ఎవరితో’ అనేదానిపై పెదవి విప్పలేదు. అలానే మహేశ్ బాబును ఆ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నించినప్పుడు ‘పూరితో సినిమా చేయాలని తనకు ఉందని, ఆయన కథ ఎప్పుడు నెరేట్ చేస్తారా? అని ఎదురుచూస్తున్నాన’ని బదులిచ్చాడు.
బట్… చిత్రంగా పూరి ‘జనగణమన’ కథను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు చెప్పాడని తెలిసింది. ఇప్పటికే పవన్ తో పూరి ‘బద్రి, కెమెరామేన్ గంగతో రాంబాబు’ మూవీస్ తీశాడు. మొదటి సినిమా సూపర్ హిట్ కాగా, రెండోది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా పూరి అంటే పవన్ కు ప్రత్యేకమైన అభిమానమే ఉంది. అందువల్ల వారిద్దరి కాంబినేషన్ లో మూడో చిత్రంగా ‘జనగణమన’ రావచ్చునని పవర్ స్టార్ అభిమానులు ఆశపడ్డారు. కానీ అది వర్కౌట్ కాలేదు.
ఆ తర్వాత కొద్ది రోజులకే ‘జనగణమన’ కథను కన్నడ స్టార్ హీరో యశ్ కు పూరి జగన్నాథ్ చెప్పాడని వార్తలు వచ్చాయి. ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యశ్ తన కథకు సరిగ్గా సరిపోతాడని పూరి భావించాడని, ‘జనగణమన’ను పాన్ ఇండియా మూవీగా తీయాలన్నది పూరి కోరిక అని అప్పట్లో చెప్పుకున్నారు. కానీ కొంతకాలంగా పూరి ‘జనగణమన’ మూవీని తన ‘లైగర్’ హీరో విజయ్ దేవరకొండతో చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇవాళ దాన్ని నిజం చేస్తూ, పూరి జగన్నాథ్, ఛార్మి ముంబైలో షూటింగ్ తో శ్రీకారం చుట్టారు.
‘లైగర్’ జయాపజయాలపైనే అంతా!
గత కొద్ది కాలంగా మంచి విజయం కోసం విజయ్ దేవరకొండ ఎదురుచూస్తున్నాడు. ‘టాక్సీవాలా’ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలు సక్సెస్ కాలేదు. అలానే విజయ్ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమా సైతం పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా పూరి తెరకెక్కిస్తున్న ‘లైగర్’ మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ ఘనవిజయాన్ని సాధిస్తే… సహజంగానే వీరి కాంబోలోని రెండో మూవీ ‘జేజీఎం’కి మరింత క్రేజ్ వస్తుంది. కానీ ‘లైగర్’ ఫలితం అటూ ఇటూ అయితే మాత్రం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ఇద్దరి కెరీర్ లోనూ కుదుపు రావడం ఖాయం. ‘లైగర్’ ఈ యేడాది ఆగస్ట్ 25న జనం ముందు వస్తుంటే, ‘జేజీఎం’ వచ్చే యేడాది ఆగస్ట్ 3న రాబోతోంది.
విజయ్ దేవరకొండ – సుక్కు మూవీ ఏమైంది!?
గత యేడాదిలోనే విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ మూవీ ఉంటుందనే ప్రకటన వచ్చింది. కానీ ‘పుష్ప’ సినిమా విడుదలలో జాప్యం కావడం, దానిని రెండు భాగాలుగా సుకుమార్ తీయాలనుకోవడంతో విజయ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళడం ఆలస్యమైంది. దాంతో అసలు ఈ ప్రాజెక్టే ఉండకపోవచ్చుననే ప్రచారమూ జరిగింది. ఇక పూరి ‘లైగర్’ తర్వాత మరే సినిమా కమిట్ కాలేదు కాబట్టి… ఆయనకే డేట్స్ ఇచ్చి మరో మూవీ ఈలోగా చేసేస్తే బెటర్ అనే నిర్ణయానికి విజయ్ దేవరకొండ వచ్చాడని, అందుకే ‘జేజీఎం’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
మహేశ్ బాబు తప్పు చేశాడా!?
మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్నాడు. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్. ఈ జోడీ మీద ఎవరికీ పెద్దంత ఎక్స్ పెక్టేషన్స్ లేవు. ఇటీవల విడుదలైన పాటలైతే సూపర్ బజ్ ను క్రియేట్ చేశాయి. కానీ మూవీ మేకింగ్ లో జరిగిన విపరీతమైన జాప్యం కారణంగా ఓవర్ ఆల్ క్రేజ్ అనేది డ్రాప్ అయ్యింది. మే 12న ‘సర్కారు వారి పాట’ సినిమా జనం ముందుకు రాబోతోంది. దాని తర్వాత మహేశ్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో మూవీ చేస్తాడని అంటున్నారు. అయితే ఇటీవల వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’కు క్రేజ్ తగ్గ సక్సెస్ దక్కలేదు. ప్రచారంపై పెట్టిన శ్రద్ధ దర్శకుడు రాజమౌళి కథపై పెట్టలేదనే విమర్శలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో మహేశ్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై ఏ స్థాయి ఆసక్తి జనంలో క్రియేట్ అవుతుందనే అనుమానం ఉంది. అలా చూసినప్పుడు ‘ఇస్మార్ శంకర్’తో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరితో మహేశ్ మూవీ చేయడంలో తప్పులేదనే అభిమానులు అనుకుంటున్నారు. బట్… మహేశ్ ప్లాన్స్ వేరేలా ఉండటంతో పూరి స్క్రిప్ట్ ను అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరి పూరీకి చెయ్యిచ్చి మహేశ్ తప్పుచేశాడా లేదా అనేది ‘లైగర్’, ‘జేజీఎం’ సినిమాల విడుదల తర్వాత కానీ తెలియదు.