రణ్‌వీర్ సింగ్ హీరోగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ రిలీజ్ విషయంలో భారతీయ ప్రేక్షకులకు షాక్ తగిలింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, విదేశాల్లో మాత్రం ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైంది. నెట్‌ఫ్లిక్స్ ఓవర్సీస్ హక్కులను దక్కించుకోవడంతో, ఇండియా మినహా మిగిలిన దేశాల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. కానీ, మన దేశంలో మాత్రం డిజిటల్ రిలీజ్‌కు బ్రేక్ పడటంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
మనదగ్గర ‘ధురంధర్ 2’ ఓటీటీ హక్కులను జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ, ఇండియాలో స్ట్రీమింగ్ ఆలస్యం కావడం వెనుక ప్రధానంగా ఐపీఎల్ 2026 సీజన్ ఒక కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో ఐపీఎల్ ప్రసారాలు జరుగుతుండటంతో, అదే సమయంలో ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేస్తే వ్యూయర్‌షిప్ దెబ్బతింటుందని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఐపీఎల్ హడావిడి తగ్గాక లేదా పూర్తయ్యాక మాత్రమే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావడానిరి మరో ముఖ్య కారణం..
ఈ సినిమాకు ధియేటర్లలో లభిస్తున్న ఆదరణ. మార్చి 19, 2026న విడుదలైన ‘ధురంధర్ 2’ ఇప్పటికీ పలు కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. బాక్సాఫీస్ వసూళ్లు ఇంకా నిలకడగా వస్తుండటంతో, నిర్మాతలకు లాంగ్ రన్ ఇచ్చే ఉద్దేశంతో డిజిటల్ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. థియేటర్ రన్ పూర్తిగా ముగిసిన తర్వాతే జియోహాట్‌స్టార్ నుంచి అధికారికంగా ఓటీటీ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.
