ధనుష్, సెల్వ రాఘవన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘నానే వరువేన్’. ఈ చిత్రాన్ని తమిళంలో కలైపులి ఎస్. థాను నిర్మించారు. దీన్ని తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమా తెలుగు వర్షన్ కు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదే నెలలో మూవీని విడుదల చేస్తామని ప్రకటిస్తూ వచ్చిన నిర్మాత కలైపులి థాను మంగళవారం విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 29న ‘నానే వరువేన్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సో… తెలుగులోనూ అదే తేదీ విడుదల అవుతుంది.
విశేషం ఏమంటే… సరిగ్గా దీనికి ఓ రోజు తర్వాత అంటే సెప్టెంబర్ 30వ తేదీ ప్రముఖ దర్శక నిర్మాత మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ సైతం పాన్ ఇండియా మూవీగా జనం ముందుకు వస్తోంది. ఇందులో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించాడు. ఇక ‘నేనే వస్తున్నా’ విషయానికి వస్తే… ”కాదల్ కొండేన్, పుదుపేట్టై, మయక్కం ఎన్న” తర్వాత తన తమ్ముడు ధనుష్ తో సెల్వరాఘవన్ తీసిన నాలుగు సినిమా ఇది. యోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రామ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చాడు. మరి ఈ నెలాఖరుకు జరుగుబోతున్న బాక్సాఫీస్ వార్ లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.