Devi Sri Prasad SS Thaman Clash At Box Office In Sankranti: ఈ సారి టాలీవుడ్ పొంగల్ హంగామా భలేగా ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ సినిమాలు మరోమారు పోటీకి సై అంటున్నాయి. వారిద్దరూ సంక్రాంతి సంబరాల్లో పలుమార్లు పోటీ పడి జనానికి వినోదం పంచారు. ఈ సారి కూడా అదే తీరున చిరంజీవి తన ‘వాల్తేరు వీరయ్య’తోనూ, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’గానూ మురిపించే ప్రయత్నం చేస్తున్నారు. వారిద్దరి మధ్య పోటీ కొత్తదేమీ కాకపోయినా, వారి అభిమానులకు మాత్రం అమితాసక్తి కలిగించే అంశమే! ఎవరి సినిమా ఎక్కువ బిజినెస్ చేసింది. ఎవరి చిత్రం ఎంత వసూలు చేసింది – అన్న అంశాలపై ఈ ఇద్దరు టాప్ స్టార్స్ ఫ్యాన్స్ ఇప్పటికే మనసు పారేసుకున్నారు.
ఆ విషయం అలా ఉంచితే, ఈ సారి పొంగల్ బరిలో మరింత ఆసక్తి కలిగిస్తోన్న అంశమేదంటే సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, థమన్ ముచ్చటగా మూడోసారి పోటీ పడుతున్నారు. గతంలో వీరిద్దరూ స్వరకల్పన చేసిన చిత్రాలు 2020లోనూ, 2021లోనూ సంక్రాంతి సంబరాల్లోనే సందడి చేశాయి. 2020 పొంగల్ కు దేవి శ్రీప్రసాద్ బాణీల్లో మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా జనం ముందుకు రాగా, ఆ సినిమా విడుదలైన మరుసటి రోజునే థమన్ స్వరకల్పనలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ‘అల వైకుంఠపురములో’ విడుదలయింది. రెండు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో ఢీ అంటే ఢీ అంటూ సాగాయి. అయితే, ‘అల… వైకుంఠపురములో’ చిత్రం వసూళ్ళలో పై చేయి అనిపించుకుంది. ఆ సినిమాతో థమన్ కు ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా అవార్డూ లభించింది. ఆ మరుసటి ఏడాది అంటే 2021 సంక్రాంతి సంబరాల్లో థమన్ బాణీల్లో తెరకెక్కిన రవితేజ ‘క్రాక్’, దేవి శ్రీప్రసాద్ స్వరాలతో రూపొందిన ‘అల్లుడు అదుర్స్’ వచ్చాయి. అప్పుడు కూడా థమన్ సినిమా ‘క్రాక్’ పైచేయి అనిపించుకుంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’పై అందరూ ఆసక్తిగా చూపు సారించారు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’కు దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’కి థమన్ బాణీలు కట్టారు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో దూకుతున్నాయి. చిత్రమేమిటంటే, ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించింది. ఒకే సంస్థ ఇద్దరు టాప్ స్టార్స్ తో నిర్మించిన చిత్రాలు ఒకే సమయంలో ప్రేక్షకులను పలకరించబోవడం అరుదైన అంశమే! ఆ విశేషంతో పాటు ఈ సారి పొంగల్ బరిలో థమన్, దేవి శ్రీప్రసాద్ లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ థమన్ స్వరకల్పన చేసిన ‘వీరసింహారెడ్డి’ హిట్ పట్టేస్తే సంక్రాంతి సంబరాల్లో ఆయనకు ‘హ్యాట్రిక్’ కూడా దక్కుతుంది. దేవిశ్రీ సంగీతం సమకూర్చిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా సక్సెస్ సాధిస్తే, ఆయనకు సంక్రాంతికి మరో హిట్ చేజిక్కినట్టవుతుంది. మరి, ఈ రెండు సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుందో అన్న అంశమూ ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఫ్యాన్స్ తో పాటు, అగ్రకథానాయకుల అభిమానులకూ ఆసక్తి కలిగిస్తున్న అంశమే!