విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రమోషన్స్ ఆరంభం అయ్యాయి. పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా బాక్సింగ్ ఛాంప్ మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా’ విజయాలతో తనకంటూ ఓ స్టార్ డమ్ సృష్టించుకున్న విజయ్ ఆ తర్వాత ‘నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్’తో ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు. అయితే తన ఎగ్రెసీవ్ నేచర్ తో బిజినెస్ టాక్టీస్ తో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటం అతని కెరీర్ కి ఎంతో హెల్ప్ అయింది. దానికి తోడు హీరోలను అల్టిమేట్ గా ప్రెజెంట్ చేయటంలో ఆరితేరిన పూరి కాంబోలో సినిమా చేస్తుండటం కూడా బాగా కలసి వచ్చింది. అలాగే బాలీవుడ్ లో కరణ్ జోహార్ అండ దొరకటంతో విజయ్ ఇమేజ్ పెరిగిందే తప్ప డ్రాప్ కాలేదు. ఇక పూరి, కరణ్, విజయ్ కాంబోలో రాబోతున్న ‘లైగర్’ కోసం అతగాడి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘అక్డి పక్డి’ పాట టీజర్ విడుదలైంది. ఇది పక్కా పూరి జగన్నాథ్ స్టైల్‌లో తెరకెక్కిన మాస్ నెంబర్. విజయ్ దేవర కొండ ఇప్పటి వరకూ సక్సెస్ సాధించినా అతని సినిమాల్లో ఈ తరహా మాస్ పాటలేవీ లేవు. పలు జబర్ దస్త్ హిట్ సాంగ్స్ ఉన్నా ఈ తరహాలో చిందేసే మాస్ నెంబర్స్ లేవనే చెప్పాలి. మాస్ హీరో ఇమేజ్ కావాలంటే ఇలాంటి పెప్సీ నెంబర్స్ ఉండాల్సిందే. ఇందులో అనన్య పాండే గ్లామర్ ట్రీట్ బాగానే ఉన్నా… విజయ్ డాన్స్ మూమెంట్స్ మాత్రం ఆకట్టుకునేలా లేవనే చెప్పాలి. ఒక వేళ పూర్తి స్థాయి పాటలో ఉండి ఉండవచ్చు. లేకుంటే మాత్రం అభిమానులు నిరాశపడే అవకాశం ఉంది. థియేటర్ ఆర్టిస్ట్ అయిన విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ తో పాటు నటన విషయంలో వంక పెట్టాల్సిన పనే లేదు. అలవోకగా చేస్తూ అవతలి ఆర్టిస్ట్ లను డామినేట్ చేస్తాడనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మాస్ హీరోగా రాణించాలంటే డాన్స్ విషయంలోనూ జాగ్రత్త పడాలి. ఇప్పుడు ‘లైగర్’ రూపంలో ఓ ఛాలెంజ్ అతడి ముందు నిలిచింది. ఇందులో ‘అక్డి పక్డి’ పాటతో పాటు ఇంకా మాస్ నెంబర్స్ ఉండి ఉండవచ్చు. ఖచ్చితంగా వాటిలో ఆకట్టుకునే స్టెప్స్ తో ఫ్యాన్స్ ను అలరించ వలసి ఉంది. టీజర్ లోలా తప్పటడుగులు పడితే డాన్స్ విషయంలో ట్రోలింగ్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకుంటే ఈతరం యువ హీరోలు నటనకంటే డాన్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. మరి ‘లైగర్’ ఎలా జాగ్రత్త పడతాడో చూద్దాం.