Ravindra Gopala: నటుడు, దర్శక నిర్మాత రవీంద్ర గోపాల తెరకెక్కించిన సినిమా ‘దేశం కోసం’. భగత్ సింగ్ అనేది ట్యాగ్ లైన్! చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు జనం ముందుకు వస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రవీంద్ర గోపాల రూపొందించారు. భగత్ సింగ్ తో పాటు 14 మంది స్వాతంత్ర సమర యోధుల పాత్రలను ఈ చిత్రంలో ఆయన పోషించారు. ఈ సినిమా ఇదే నెల 10న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ లో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షులు సి. కళ్యాణ్ మాట్లాడుతూ, ”దాసరి నారాయణ రావు గారి కోసం అప్పట్లో నేను రిజిస్టర్ చేసిన టైటిల్ ఇది. అయితే… రవీంద్ర గోపాల ఒకసారి ఫోన్ చేసి అడగటంతో ఆయనకు ఇచ్చేశాను. ట్రైలర్ చాలా బాగుంది. పాటలూ చక్కగా ఉన్నాయి. ఈ సినిమాను పూర్తిచేసి విడుదల చేయడానికి రవీంద్ర గోపాల ఎన్ని ఇబ్బందుల పడ్డారో నాకు తెలుసు. దేశం మీద ప్రేమ ఉన్న వారు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది” అని అన్నారు. సామాజిక స్పృహతోనూ, బాధ్యతతోనూ తీసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని రామ సత్యనారాయణ కోరారు. దేశం కోసం నిస్వార్థంగా పనిచేసిన వారి గురించి ఈ తరానికి తెలియానే తలంపుతో రవీంద్ర గోపాల ఈ చిత్రాన్ని కష్టనష్టాలకు ఓర్చు తీశారని రచయిత సూర్యప్రకాశ్ చెప్పారు. ఇందులో ఆయన ఓ పాటను రాయడమే కాకుండా అన్ని పాటలను పాడారని తెలిపారు. ఈ సినిమాలో తాను భగత్ సింగ్ గా నటించానని, తన కుమారుడితో చంద్రశేఖర్ ఆజాద్ పాత్ర చేయించానని రవీంద్ర గోపాల చెప్పారు. దీనిని పంపిణీ చేస్తున్న శంకర్ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.