Rajesh Touchriver: బంగారు తల్లి సినిమా చూసి కంటనీరు పెట్టనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకొంది. అందుకు కారణం ఈ సినిమా డైరెక్టర్ రాజేష్ టచ్‌రివర్. వాస్తవ ఘటనలు ఆధారంగా రాజేష్ టచ్‌రివర్ సినిమాలు తీస్తుంటారు. దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి ఆయనది అదే పంథా. ఇక అప్పుడు బంగారు తల్లితో సంచలనం సృష్టించిన రాజేష్ ఇప్పుడు దహిణి అనే సినిమాతో మరో సంచలనం సృష్టించాడు. తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం దహిణి.ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు. గతంలో ఎన్నో సమస్యలను సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ‘విచ్ హంటింగ్’ పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో.. వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక అయ్యింది. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో గౌరవం దక్కడం ఇది రెండోసారి. ఈ చిత్రానికి పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డు లభించింది.
ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా ‘దహిణి’ చిత్రాన్ని రూపొందించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం.. మన దేశంలో 2001 నుండి 2019 వరకు దాదాపు 2937 మంది మంత్రవిద్యలు చేస్తున్నారనే అనుమానంతో దారుణంగా చంపబడ్డారు. కేవలం 2019 సంవత్సరంలోనే 102 మందిని మంత్రగత్తెలుగా భావించి వివిధ గ్రామాల ప్రజలు అత్యంత కిరాతంగా చంపారు. ఇటువంటి దురాగతాలపై ఎటువంటి కేసు లేదనే చెప్పాలి. ఒడిశా హైకోర్టు 2021లో చెప్పినదాని ప్రకారం.. ప్రతి నెల నలుగురు మహిళలు మంత్రవిద్య చేస్తున్నారనే నెపంతో దారుణంగా హత్యకు గురవుతున్నారు. ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తే హత్యకు గురవుతున్నవాళ్లలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక యునైటెడ్ నేషన్స్ అందించిన నివేదిక 1987 నుంచి 2003 మధ్యన సుమారు పాతికవేల మందిని మంత్రగత్తెలనే అనుమానంతో దారుణంగా చంపారని నిర్ధారణ చేసింది. ఈ వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.