Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి చిత్ర పరిశ్రమలో అందరికి తెల్సిందే. కావాలని ఒకరి జోలికి వెళ్ళడు.. ఒకరితో గొడవ పెట్టుకోడు. స్నేహానికి ప్రాణం పెట్టే ప్రభాస్ ను అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారు. ఇక ఇండస్ట్రీలో ప్రభాస్ స్నేహితుడు ఎవరు అంటే టక్కున కమెడియన్ ప్రభాస్ శ్రీను గురించి చెప్పుకొచ్చేస్తారు. ప్రభాస్ కు ఫ్రెండ్ గా వచ్చిన శ్రీను తన పేరును ప్రభాస్ శ్రీనుగా మార్చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న శ్రీనును ఈ మధ్య ప్రభాస్ దూరం పెట్టాడని, వారిద్దరి మధ్య గొడవలు జరిగాయని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ విషయమై ప్రభాస్ శ్రీను క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ” నాకు, ప్రభాస్ కు మధ్య గొడవలు అయ్యాయని, ఆయన నన్ను దూరం పెడుతున్నాడని వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదు. డార్లింగ్ ను వదులుకోవాలని ఎవరు అనుకోరు.. ప్రభాస్ నాకు సత్యానంద్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో ఉన్నప్పటి నుంచి పరిచయం. ప్రభాస్ కు పాన్ ఇండియా హీరో అయ్యాకా, స్థాయి పెరిగాక ఎలా ఉండాలో తెలియదు. అందరితోనూ ఒకేలా మాట్లాడతాడు. అప్పుడే కాదు ఇప్పుడు, ఎప్పటికి ప్రభాస్ లో ఆ మార్పు రాదు. తను నాకు మంచి స్నేహితుడు. ఇప్పటికి నాతో అంతే చనువుగా మాట్లాడతాడు. ఇలాంటి పుకార్లను ఎవరో పనీపాటా లేనివారు సృష్టిస్తున్నారు” అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతూ ” ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా అద్భుతంగా నటించాడు. ఆయనను అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఈ సినిమాతో ప్రభాస్ ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు” అని చెప్పుకొచ్చాడు.