అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్క భారతీయుడిని కంటతడి పెట్టించింది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించిన విషయం విదితమే. అయితే ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సైతం మజార్ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం ఇప్పటివరకు ఈ సినిమాపై ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం విశేషం. ఒక దేశ భక్తుని వీర గాధను సినిమాగా తీస్తే ముందు బీజేపీ నే సపోర్ట్ గా నిలిచి ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ అని చెప్తుంది అనుకున్నారు అంతా.. కానీ అదేం జరగలేదు. దీంతో అభిమానులు కొద్దిగా అసహనం వ్యక్తం చేసారు.
గత కొన్ని రోజుల క్రితం “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాను వీక్షించిన బీజేపీ నేతలు సినిమా బావుందని చెప్పడమే కాకుండా చిత్ర బృందాన్ని పర్సనల్ గా పిలిచి వారికి సత్కారం కూడా చేశారు. అదే విధంగా ఒక భారతీయ జవాన్ సినిమా మేజర్ ను వారు ఎందుకు పట్టించుకోలేదని విమర్శలు గుప్పుమన్నాయి. ఇక తాజాగా ఆ విమర్శలకు తెరదించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్. ఇటీవల మేజర్ సినిమా చూసిన ఆయన చిత్ర బృందానికి సన్మానం చేశారు, అంతేకాకుండా చిత్ర బృందం మొత్తానికి వెండి నాణాలను బహుకరించారు. ఈ విషయాన్ని అడివి శేష్ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
“గౌరవనీయులైనఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గారిని కలవడం మర్చిపోలేని క్షణం.. సందీప్ తల్లిదండ్రులు, చిత్ర బృందం తో కలిసి ఆయనను కలవడం అద్భుతంగా ఉంది. ‘మేజర్’ పై ఆయన ప్రశంసలు కురిపించడం మరియు మాకు శాలువా కప్పి వెండి నాణాలు బహుకరించడం నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. ఆయన పది నిమిషాల సినిమా చూసి ఉత్తరప్రదేశ్ లో ఉన్న యువతను మేజర్ సందీప్ లా మారడానికి మాకు హెల్ప్ చేస్తానని మాకు హామీ చెప్పారు. మాకు ఇలాంటి ఒక గొప్ప గౌరవం ఇచ్చినందుకు, మమ్మల్ని ప్రోత్సహించిందకు మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Memorable moment to meet the Honourable Chief Minister of UP Shri #YogiAdityanath along with the team and Uncle & Amma, parents of #MajorSandeepUnnikrishnan Was so amazing to hear commendations of #MajorTheFilm and to be gifted with a shawl and silver Coin🙏🏼🇮🇳 A real Honor. pic.twitter.com/D6ThfZEEc8
— Adivi Sesh (@AdiviSesh) June 21, 2022